పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి .. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి .. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖలు
  • పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా దేశ ఐక్యత చాటాలని పిలుపు

న్యూఢిల్లీ: పహల్గాంలో టెర్రరిస్టుల దాడితో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాగే దేశ ఐక్యతను చాటేందుకు పార్లమెంటు ఉభయసభలను సమావేశ పరచాలని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానిని కోరారు. ‘ఈ సమయంలో ఐక్యత, సంఘీభావం అవసరం, పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన క్రూరమైన దాడిని ఎదుర్కోవాలన్న మన దేశ సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది. 

పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తారని మేం ఆశిస్తున్నాము” అని ఖర్గే తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్స్ వింగ్ హెడ్ జైరామ్ రమేశ్ ఈ లేఖను సోషల్ మీడియా ‘ఎక్స్’ లో షేర్ చేశారు. “పహల్గాం​లో జరిగిన టెర్రరిస్టు దాడి ప్రతి ఇండియన్​లో ఆగ్రహాన్ని రగిలించింది. ఈ కఠిన సమయంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా కలిసి నిలబడతామని ఇండియా చూపించాలి. పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. 

హౌస్​లో ప్రజా ప్రతినిధులు తమ ఐక్యతను, సంకల్పాన్ని చాటుతారు. అటువంటి ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను” అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ కోరారు. పహల్గాం​ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రతిపక్ష నాయకులకు వివరించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఉంటుందని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రభుత్వానికి చెప్పారు.