దుర్గం చిన్నయ్య కబ్జా చేసిన భూములను ప్రజలకు పంచి పెడతా : గడ్డం వినోద్

  • ఎమ్మెల్యే అఘాయిత్యాలపై విచారణ జరిపిస్తా
  • కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ వెల్లడి

బెల్లంపల్లి, వెలుగు: తాను గెలిచిన వెంటనే సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కబ్జా చేసిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచి పెడతానని కాంగ్రెస్ బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శంషీర్ నగర్, అంబేద్కర్ నగర్, కాంట్రాక్టర్ బస్తీల్లోని వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ నగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్​లో పాల్గొని ప్రసంగించారు. 

రెండు సార్లు బెల్లంపల్లి ప్రజలు చిన్నయ్యను ఎమ్మెల్యే గా గెలిపిస్తే అభివృద్ధిని మరిచి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దుర్గం చిన్నయ్య అరాచకాలు, అమ్మాయిలపై అఘాయిత్యాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తానని వినోద్ వెల్లడించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్, షంషీర్ నగర్, కాంట్రాక్టర్ బస్తీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ప్రచారంలో సీపీఐ నియోజకవర్గ ఇన్​చార్జ్ రేగుంట చంద్రశేఖర్,  మూడో వార్డు మున్సిపల్  కౌన్సిలర్ పత్తిపాక రేణుక, మున్సిపల్ కౌన్సిలర్ మాజీ రాజ్ కుమార్, లీడర్లు కాసర్ల యాదగిరి, పోచంపల్లి హరీశ్, కుంబాల రాజేశ్, శంకర్, స్వామి, రమేశ్, రాజనర్సు, యశోద, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వేమయపల్లి మండలంలోని చామనపల్లి, బద్దంపల్లి, బొమ్మెన గ్రామాల్లో వినోద్ కూతురు గడ్డం వర్ష ప్రచారం చేయగా ఆమెకు గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దెబ్బేటి రమేశ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నేత మునిమంద రమేశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. 

బెల్లంపల్లిలోనే ఉంటానని బాండ్​ పేపర్ ​ద్వారా వెల్లడి 

ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రజా సేవ చేస్తానని గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. సుభాశ్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం బాండ్ పేపర్​తో కూడిన అంగీకార పత్రాన్ని ప్రజలకు చూపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వినోద్ వెంట టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, టౌన్ ఎన్నికల ఇన్ చార్జ్ కేవీ ప్రతాప్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్ తదితరులున్నారు. 

నిరుద్యోగుల బతుకులు ఛిద్రం చేసిన బీఆర్ఎస్​ను ఓడించాలి: నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గణేశ్పేపర్ లీకేజీల ద్వారా నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేసిన బీఆర్​ఎస్​ పార్టీని, బెల్లంపల్లిలో ఆ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను చిత్తుగా ఓడించాలని నిరుద్యోగ ఓయూ జేఏసీ చైర్మన్ జె.గణేశ్ ప్రజలకు  పిలుపునిచ్చారు. కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వినోద్​కు మద్దతుగా బెల్లంపల్లి పట్టణంలోని ఒకటో వార్డు మదునన్న నగర్,14వ వార్డు కన్నాలబస్తీల్లో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 

గణేశ్ మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణను పదేండ్లుగా పాలిస్తున్న కేసీఆర్ పేపర్లు అమ్ముకొని నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే నిరుద్యోగుల మెడకు ఉరిపెట్టుకున్నట్టేనని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు వచ్చిన గడ్డం వినోద్​ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ ప్రచారంలో కౌన్సిలర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.