అవకాశం ఇస్తే ప్రజాసేవ చేస్తా : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: అధికారం లేనప్పుడే ఎంతో సేవ చేశానని, ఒక్క అవకాశం ఇస్తే  ప్రజలకు మరింత సేవ చేస్తానని కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు.  ఆదివారం  భూదాన్​ పోచంపల్లి, భువనగిరి మండలాల్లో ఆయన  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. 

ప్రభుత్వ పథకాలు సైతం కేవలం కార్యకర్తలకు వచ్చాయని ఆరోపించారు. స్థానికేతరుడైన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి రెండుసార్లు అవకాశం ఇస్తే  నియోజకవర్గాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. కనీసం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.  గతంలో ఇచ్చిన హామీలను విస్మరించారని, ఇప్పుడు మాయ మాటలు చెప్పి మళ్లీ గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తనకు ఒక్క చాన్స్ ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.  అనంతరం  వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లోకి చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు.