
- అసంతృప్త నాయకులకు గాలం
- గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు కృషి
మెదక్, వెలుగు : మెదక్ లోక్ సభ స్థానంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. మూడు పార్టీలు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా క్యాడర్ ను సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టాయి. మరో వైపు ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులను చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అందరికంటే ముందుగా బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను ప్రకటించింది. ఆయన ముందుగానే పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టారు.
లోక్‌సభ నియెజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మండలాలు, మున్సిపాలిటీల వారీగా బూత్ కమిటీ ఇన్‌చార్జిలతో మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరిస్తుండడంతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ వాటిని ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రెస్మీట్లు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
బీఆర్ఎస్బాధ్యత హరీశ్‌రావుకు..
బీఆర్ఎస్అభ్యర్థిగా ఎమ్మెల్సీ, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గెలుపు బాధ్యతను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోఆర్డినేట్ చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
పార్టీ క్యాండిడేట్వెంకట్రామిరెడ్డితో కలిసి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ మీటింగ్‌లు నిర్వహిస్తూ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ కక్షసాధింపు చర్యలను ప్రజలకు వివరించి ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని కోరుతున్నారు.
చేరికలపై కాంగ్రెస్ ఫోకస్..
కాంగ్రెస్ అందరికంటే చివరగా పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఖరారు చేసింది. అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బా, మెదక్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్వైస్ చైర్మన్, కౌన్సిలర్లను కాంగ్రెస్‌లో చేర్చుకుని అవిశ్వాస తీర్మానం ద్వారా బీఆర్ఎస్ చైర్మన్‌ను గద్దె దించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్‌వైపు ఆకర్షితులను చేసి జాయిన్అయ్యేలా చేశారు.
దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట మండలానికి చెందిన ఎంపీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ప్రవీణ్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్పరమేశ్, సీనియర్ నాయకుడు, అసిస్టెంట్కేన్ కమిషనర్ భూంలింగం గౌడ్ తదితరులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేలా కృషి చేశారు. నీలం మధుకు టికెట్ ఖరారయ్యాక నర్సాపూర్మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్మాజీ చైర్మన్ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు.