- పాలమూరు క్యాండిడేట్లతో పాటు లీడర్ల సవాళ్లు, ప్రతి సవాళ్లు
మహబూబ్‌నగర్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య అభివృద్ధిపై మాటల యుద్ధం నడుస్తోంది. తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హస్తం నేతలు, మోదీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కమలం నేతలు వాదనలకు దిగుతున్నారు. రెండు పార్టీలకు చెందిన లీడర్లు, ఆయా పార్టీల క్యాండిడేట్లు డెవలప్మెంట్పై ఒకరిపై ఒకరు ప్రశ్నలు గుప్పించుకుంటున్నారు.
బీజేపీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం..
- పదేండ్లు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కొడంగల్‌లోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. ఆయనతో పాటు మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్‌నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై బీజేపీ క్యాండిడేట్‌ను, ఆ పార్టీ లీడర్లను ప్రశ్నిస్తున్నారు. వారు లేవనెత్తుతున్న ప్రశ్నల్లో ప్రధానమైనవి..
- 2014 ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో మోదీ ‘పాలమూరు’ స్కీమ్‌కు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న డీకే అరుణ, ఎందుకు జాతీయ హోదా తేలేకపోయారు?
- అచ్చంపేట–-తాండూరు, కృష్ణా-–వికారాబాద్ రైల్వే లైన్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని సాధించేందుకు బీజేపీ లీడర్లు ఎందుకు పట్టుబట్ట లేదు?
- కొడంగల్, నారాయణపేటలలో ఏ ఒక్క కుటుంబానికైనా డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా?
- రాష్ట్ర విభజన జరిగి దశాబ్దమైనా కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను ఎందుకు తేల్చడం లేదు? దీనిపై కేంద్రం వద్ద బీజేపీ లీడర్లు ఎందుకు ప్రస్తావించలేదు?
- గత రాష్ట్ర సర్కారు ‘కొడంగల్–-నారాయణపేట’ స్కీమును పక్కకు పెట్టింది. దీనిపై ఇన్నాళ్లు బీజేపీ లీడర్లు ఎందుకు మాట్లాడలేదు?
- నారాయణపేటకు మంజూరైన సైనిక్ స్కూల్‌ను వేరే ప్రాంతానికి తరలించారు. దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు?
- రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతంలోని బీళ్లను తడిపేందుకు రూ.4 వేల కోట్లతో ‘కొడంగల్–-నారాయణపేట’ స్కీమ్ మంజూరు చేసింది. ‘టాస్క్’ ద్వారా పాలమూరులో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గానికి వంద రోజుల్లో మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేసింది. పరిశ్రమల స్థాపనకు భూసేకరణ కూడా జరుగుతోంది.
కౌంటర్ ఇస్తున్న బీజేపీ..
- బీజేపీ లీడర్లు, ఆ పార్టీ పాలమూరుక్యాండిడేట్ డీకే అరుణ కాంగ్రెస్‌పై రివర్స్ అటాక్‌కు దిగుతున్నారు. ప్రెస్మీట్లు పెడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై నిలదీస్తున్నారు.
- కేసీఆర్ మీద కోపంతో ప్రజలు ఓట్లు వేస్తే గుడ్డిలో మెల్లలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత పదేండ్లలో బీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ, తాము పోరాటాలు చేస్తే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది. ‘పాలమూరు’ స్కీం పాత డిజైన్‌కు కాంగ్రెస్ అప్రూవల్ ఇప్పిస్తే, జాతీయ హోదాపై మోదీతో మాట్లాడతాం.
- రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. రైతు బంధు వచ్చిందా? రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా?
- యాసంగి వడ్ల సెంటర్లు ఓపెన్ చేసిన్రు. వడ్లకు రూ.500 బోనస్ వస్తోందా? రూ.500 గ్యాస్ సిలిండర్ ఏమైంది? ఈ హామీల సంగతేంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలు చేసింది?
- తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు కేంద్ర నిధులతోనే జరిగాయి. దేశంలో మోదీ సంక్షేమం చేరని ఇల్లు లేదు. లబ్ధి పొందని వ్యక్తి లేడు. అంటూ కౌంటర్ ఇస్తున్నారు.