హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. బైపోల్ షెడ్యూల్ రాకముందే ఓవైపు ప్రచారం మొదలుపెట్టిన ఆయా పార్టీలు.. మరోవైపు జనం నాడిని పసిగట్టేందుకు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పరిస్థితి, అభ్యర్థి బలాబలాలు, జనం ఎటువైపు ఉన్నారు? వారు ఏమి కోరుకుంటున్నారు? ఏ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతోంది? తదితర అంశాలపై సర్వే టీమ్స్ సమాచారం సేకరిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒకే సర్వే సంస్థను నమ్ముకోకుండా క్రాస్ చెక్ కోసం నాలుగైదు సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మునుగోడులో దాదాపు 15 దాకా సర్వే ఏజెన్సీలు పని చేస్తున్నాయి.
ఇంటెలిజెన్స్ తో పాటు ప్రైవేట్ ఏజెన్సీలతో టీఆర్ఎస్ సర్వేలు..
మునుగోడులో టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ సర్వేలు మాత్రం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ పాలనపై జనంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఏ సామాజికవర్గం వారు ఎటు సపోర్టుగా నిలువనున్నారు? ఏ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెడితే పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి? అనే అంశాలపై వివిధ ఏజెన్సీలతో సమాచారం సేకరిస్తోంది. అధికార పార్టీ కావడంతో ఓవైపు స్పెషల్ బ్రాంచీ, ఇంటెలిజెన్స్ పోలీసులతో సర్వే చేయిస్తూనే మరోవైపు ప్రైవేట్ ఏజెన్సీలతోనూ చేయిస్తోంది. ఒక ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించిన తర్వాత దానిపై క్రాస్ సర్వే చేయిస్తున్నారు. ఇలా ఒక టీఆర్ఎస్ నే నాలుగైదు ఏజెన్సీలను రంగంలోకి దింపింది. ఇప్పుడు ఆ పార్టీకి ఐప్యాక్ తన సేవలు నిలిపివేయడంతో విశ్వసనీయత ఉన్న ఏజెన్సీలను సంప్రదిస్తూ సర్వేలు చేయిస్తోంది.
నాలుగు సర్వేలు చేయిస్తున్న బీజేపీ..
బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా ఒక సర్వే చేయిస్తోంది. ఆ ఏజెన్సీ నేరుగా ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్ కే రిపోర్టు పంపనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్‌తో సర్వే చేయించి, ఆ రిపోర్టు ఆధారంగా రాష్ట్ర పార్టీని అప్రమత్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ కూడా యూపీ నుంచి ప్రత్యేక టీమ్ లను తీసుకొచ్చి సర్వే చేయిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ మరో సర్వే చేయిస్తోంది. ఇలా బీజేపీ కూడా నాలుగు సర్వేలు చేయిస్తోంది. ఇక కాంగ్రెస్ రెండు, మూడు ఏజెన్సీలతో ఒప్పందం చేసుకొని ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. కేవలం పార్టీలే కాకుండా అభ్యర్థులు సైతం సొంతగా సర్వేలు చేయించుకుంటున్నారు.