బీజేపీ, కాంగ్రెస్​ మధ్య గద్దర్​ వార్​.!

బీజేపీ, కాంగ్రెస్​ మధ్య గద్దర్​ వార్​.!
  • నక్సల్​ భావజాలం ఉన్న గద్దర్​కు పద్మ అవార్డు ఎందుకియ్యాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్​
  • వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పొట్టనపెట్టుకున్నారని వ్యాఖ్య
  • బండి సంజయ్​ కామెంట్లపై కాంగ్రెస్​ నేతల మండిపాటు
  • గద్దర్​ను ఆలింగనం చేసుకున్నప్పుడు భావజాలం ఏమైంది?: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్
  • బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైనో, ఈటలపైనో అర్థమైతలే: విప్​ ఆది శ్రీనివాస్​
  • ఆ కామెంట్లు రాష్ట్రపతిని, ప్రధానిని అవమానించడమే: ఎంపీ చామల
  • గద్దర్​ను పొగుడుతూ మోదీ రాసిన లేఖను బయటపెట్టిన సామ రామ్మోహన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ‘‘నక్సల్స్​ భావజాలంతో బీజేపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న గద్దర్​కు పద్మ అవార్డు ఎందుకియ్యాలి?”అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు. బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుందన్నట్లుగా బండి సంజయ్​కామెంట్లు ఉన్నాయని.. ఇది రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని అవమానించడమేనని తెలిపారు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్​పై చేసిన కామెంట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. గద్దర్​ చనిపోయినప్పుడు ఆయన పోరాటాన్ని  కొనియాడుతూ ప్రధాని మోదీ రాసిన లేఖను కాంగ్రెస్​ నేతలు విడుదల చేశారు. దీనిపై బండి సంజయ్​ ఏం సమాధానం చెప్తారని వారు ప్రశ్నించారు. ‘‘ప్రజాయుద్ధనౌక గద్దర్​ను ఆలింగనం చేసుకున్నప్పుడు బండి సంజయ్​కి ఆయన భావజాలం గుర్తుకురాలేదా? ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ భావజాలం ఉన్నవాళ్లకే పద్మ అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా?’’ అని సంజయ్​ని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ నిలదీశారు. మాజీ మావోయిస్టు ఈటలను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అని, అలాంటి పార్టీకి చెందిన సంజయ్​.. గద్దర్ విషయంలో మరోలా మాట్లాడటం ఏమిటని ప్రభుత్వ విప్​ ఆది శ్రీని వాస్​ ప్రశ్నించారు. బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైనో, లేదంటే ఈటలపైనే అర్థం కావడం లేదు” అని ఆది శ్రీనివాస్​విమర్శించారు. 

బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మహేశ్​​గౌడ్​

కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలకే పద్మ శ్రీ అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? నాడు ప్రజాయుద్ధ నౌక గద్దర్​ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన భావజాలం బండి సంజయ్​కి గుర్తుకురాలేదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర మంత్రి  వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ‘‘మోదీకి రాజ్యాంగ సూత్రాల మీద అవగాహన ఉంటే బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. బీజేపీ నేతలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ప్రజా యుద్ధనౌక గద్దర్  పేరు  చిరస్మరణీయం” అని తెలిపారు. కరసేవకుల మీద కాల్పులు చేయించిన నేతలకు అవార్డులు ఇచ్చినప్పుడు బండి సంజయ్​కి ఆ భావజాలం సోయి ఎటుపోయిందని ప్రశ్నించారు. ‘‘వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు బీజేపీలో లేరా..? ‘నక్సలిజం నా ఎజెండా’ అని చెప్పిన ఈటల రాజేందర్ ను పార్టీ లో చేర్చుకొని ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు? నక్సలైట్లు మా దేశ భక్తులు అన్న ఎన్టీఆర్ తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా? 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది బీజేపీ  భావజాలం ఉన్న వారు పార్టీ టికెట్​పై పోటీ చేశారు?  ఇటీవల  కొత్తగా ఎన్నికైన బీజేపీ మండల అధ్యక్షుల్లో ఎంతమంది మీ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు” అని బండి సంజయ్​ని నిలదీశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి ఎక్కువ... కార్పొరేటర్ పదవికి తక్కువ అని ఆయన విమర్శించారు. ‘‘త్వరలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్ష రాబోతున్నడు. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోతున్నదన్న అసహనంతో సంజయ్ ఈ మాటలు మాట్లాడుతున్నడు” అని మహేశ్​గౌడ్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీజేపీకి పాటపాడిన వాళ్లకే ఇస్తరా?:  చామల

‘‘బీజేపీకి పాట పాడిన వారికి, ఆ పార్టీకి జై కొట్టిన వారికే పద్మ అవార్డులు ఇస్తారా..?”అని బండి సంజయ్​ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలదీశారు. ‘‘సంజయ్ కేంద్ర మంత్రినా..కార్పొరేటరా.. అర్థం కావట్లే. బీజేపీ భావజాలం ఉన్నవారికే పద్మ అవార్డులు ఇస్తామన్నట్లు ఆయన కామెంట్లు ఉన్నాయి. ఇవి రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని కూడా అవమానించినట్లే” అని అన్నారు. నాడు పరేడ్ గ్రౌండ్​లో మోదీ మీటింగ్ కు కూడా గద్దర్ వచ్చిన విషయం  బండి సంజయ్  మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. గద్దర్ పై సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ‘‘నిష్పక్షపాతంగా ఇవ్వాల్సిన అవార్డులు.. సంజయ్ వ్యాఖ్యల వల్ల మోదీ  ప్రభుత్వాన్ని దిగజార్చినట్లయింది” అని చామల అన్నారు. 

గద్దర్​ పోరాటాన్ని మోదీ పొగిడింది మరిచినవా?: సామ రామ్మోహన్​రెడ్డి

గద్దర్ చనిపోయినప్పుడు ఆయన పోరాటాన్ని పొగుడుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖ విషయాన్ని బండి సంజయ్​ మరిచిపోయారా? అని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిఒక్కరినీ కదిలించిన వ్యక్తి గద్దర్​ అని.. తెలంగాణ ఉద్యమంలో  సంజయ్​ పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్​ చేశారు. గద్దర్​ కుటుంబానికి మోదీ రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. ‘‘బండి సంజయ్.! రాములవారి మీద ఒట్టు వేస్తావా.. రాజ్యాంగం మీద ఒట్టు వేస్తావా చెప్పు.. కేంద్ర మంత్రిగా చేస్తున్న వ్యాఖ్యలు దురుద్దేశంతో చేస్తున్నట్లుగా,  తెలంగాణ  ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయి.  తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తరు” అని హెచ్చరించారు.  

ఆయన ఏడుపు గద్దర్​పైనా? ఈటల పైనా?:  ఆది శ్రీనివాస్​

‘‘మాజీ నక్సలైట్  ఈటలను బీజేపీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇవ్వొచ్చు, కాని గద్దర్ లాంటి వారికి పద్మ అవార్డులు ఇవ్వడం అభ్యంతరకరమా?” అని బండి సంజయ్​పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఫైర్​ అయ్యారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ నక్సలైట్ ని పార్టీ అధ్యక్షుడిగా చేసుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుంది. బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైనా.. లేక ఈటలపైనా? గద్దర్ పేరును అడ్డం పెట్టుకొని ఈటలపై బండి సంజయ్ ప్రతీకారం తీర్చుకునేలా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది” అని అన్నారు. గద్దర్ తెలంగాణ వాది,  తెలంగాణ పాటల గని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  లక్షలాది కిలోమీటర్లు నడిచిన వ్యక్తి గద్దర్ అని ఆయన గుర్తు చేశారు.