తెలుగు (ఆంధ్రా, కేసీఆర్) మీడియాకు ఎప్పుడూ బీజేపీ అంటే కోపం. మరీ ముఖ్యంగా ఆంధ్రా పెట్టుబడిదారుల చేతుల్లోని ఈ వర్గం హైదరాబాద్‌లో తమ అక్రమ వ్యాపారాలను నడిపించే కాంగ్రెస్, టీడీపీ ప్రాపకం ఎప్పుడూ సంపాదిస్తూ వచ్చాయి. ఆంధ్రావారికి వ్యతిరేకంగా పుట్టిన టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లో కూడా ఇప్పుడు వారి హవా నడుస్తోంది. ఆ పిడికెడు మంది ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు ఎప్పుడూ ఇదేదో ప్రత్యేక దేశం అనే భావన సృష్టిస్తుంటారు. ఆంధ్రాను కులాల కుంపటిగా మార్చి వేల కోట్లు దండుకున్న వర్గమూ ఇదే. ఇందులో మీడియా, సినీ, వ్యాపారవర్గాల తెరవెనుక మంత్రాంగం ఎప్పుడూ ఉంటుంది. వీరు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. కాంగ్రెస్‌లో కెవిపి, బీజేపీలో వెంకయ్య, కమ్యూనిస్టుల్లో రాఘవులు వంటి వారే ఇందుకు ఉదాహరణ. వాళ్లు పెద్దమనుషుల్లా, దిశానిర్దేశకుల్లా కన్పిస్తారు. కానీ వీరు ఎప్పుడూ ఎవరి ప్రయోజనం కోసమో పనిచేస్తుంటారు అన్నది నడుస్తున్న చరిత్ర చెబుతున్న సాక్ష్యం.
కాంగ్రెస్ బీఆర్‌ఎస్ డిన్ఏ ఒక్కటే!
అస్థిపంజరంగా తయారైన కాంగ్రెస్, బీజేపీలకు ఆక్సిజన్ ఎక్కించింది కేసీఆర్ కుటుంబపాలన, అవినీతే. నల్లగొండ, పాలమూరులకు చెందిన రెడ్డి సామాజిక వర్గం గతంలో తెలంగాణ పేరు చెప్పి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌లో తమ ప్రాభవం నిలబెట్టుకొనేవారు. తెలుగుదేశంపార్టీ ఏర్పాటు తర్వాత బీసీలు చాలామంది రాజకీయంగా ఎదిగినా తర్వాత కాలంలో వాళ్లకు పెద్దగా స్వయంప్రకాశం ఉండేది కాదు. 2014లో తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో గెలిచిన నాయకుల చరిత్ర అంతా ‘కోవర్టు’ల బాపతే. రేపు గెలిస్తే రేవంత్ వాళ్ళను నిలబెట్టుకొనే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్‌లో మనిషికో గ్రూపు ఉంది. ఈ చిదంబర రహస్యాలన్నీ కేసిఆర్‌కు తెలుసు. మరీ ముఖ్యంగా కేంద్రంలో నరేంద్రమోడీని గద్దె దించడం అనే పరమ ప్రయోజనం కాంగ్రెస్ అధిష్టానం లక్ష్యం. గతంలో కుమారస్వామితో కలిసినా, ఇటీవల ఆగర్భ శత్రువైన ఉద్ధవ్ థాకరేతో కలిసినా అదే ప్రయోజనం కాబట్టి. రేపు కేసీఆర్ కాంగ్రెస్ పెద్దలకు అంటరానివాడు ఏమీ కాడు. అందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డిఎన్‌ఎ ఒక్కటే. అది కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లను ఎప్పటికైనా ఒక్కటి చేస్తుంది.
సూడో సెక్యులర్లు
ఇక వీళ్లందరితో పోరాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండేండ్ల నుంచి కేసీఆర్‌ను గట్టిగా ప్రశ్నించడం ప్రారంభించింది. పార్టీలో అది పాత కొత్త కలయికల సమిష్టిబలం. గతంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం మండలి, అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంలో కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ చూసి అందరికీ భయం వేసింది. అలాంటి హావభావాలతో కేసిఆర్ ఇపుడు మాట్లాడగలడా? ఎందుకంటే మరుసటిరోజు బీజేపీ మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టింది. ఇప్పటికే హిందువులపై దాడులు, హిందూ ఏకత, దేవుళ్ల దగ్గర ప్రమాణాలు, యాదాద్రి శిల్పాలపై ముస్లిం చిహ్నాల వివాదం, లవ్‌జిహాద్, తెలంగాణ విమోచనం వంటి అనేక అంశాలను బీజేపీ తెరమీదకు తెచ్చింది. ఇపుడు కేసీఆర్ చెప్పే లౌకిక వాద సూత్రాలు, గంగాజమునా తెహజీబ్ వంటివి కొత్తవేం కావు. లాలూప్రసాద్ యాదవ్, కరుణానిధి, ములాయం, శరద్‌పవార్, దిగ్విజయ్‌సింగ్ వంటి నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఇవన్నీ మాట్లాడి ఇపుడు కొడిగట్టిన దీపాలయ్యారు. అలాగే ఇటీవల తెలుగు ప్రాంతంలో పత్రికల్లో తిష్ట వేసుక్కూర్చున్న సూడో సెక్యులర్ మేధావులు ఇలాంటి ధర్మ పన్నాలను వల్లిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీకి అవకాశాలు అపారం
ఇపుడు తెలంగాణలో బీజేపీ గెలుపునకు మోడీ చరిష్మా, సమిష్టి రాష్ట్ర నాయకత్వం సరిపోతుంది. కానీ అధిష్టానం పైన అనుమానపు నీలినీడలు కమ్మడానికి ‘కవిత అరెస్ట్’ కీలకం అని మీడియా ప్రచారం చేస్తోంది. దీనికితోడు ఇపుడు బీజేపీలో రెండు వర్గాల నాయకులున్న మాట వాస్తవం. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ తెలియని పార్టీకాదు. దాని జాతీయవాద భావజాలానికి తెలంగాణ కలిసొచ్చే రాష్ట్రం. ప్రస్తుతం దానికి తోడుగా కేసీఆర్ పాలనపై వ్యతిరేకతే గెలుపునకు పనికొచ్చే ప్రధానాంశం. అందులో ఈటెల, సంజయ్ అంతా పనికొచ్చే నాయకులే. అదేవిధంగా బీజేపీకి స్థిరమైన ఓటు బ్యాంక్ పదిశాతం ఎప్పుడూ ఉంది. మోడీ చరిష్మాతో మరో 10 శాతమూ 2019లోనే కలిసొచ్చింది. ఇక మిగిలిందల్లా మరో 15శాతం ఓట్లు రాబట్టుకోగలగాలి. అది కేసీఆర్ పరిపాలనపై పెరిగిన వ్యతిరేకత నుంచే రాగలుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాబట్టే ప్రయత్నం తీవ్రంగా జరగాలి. కేంద్ర నాయకత్వం కూడా కేసీఆర్ అవినీతి పాలనపై కాస్త సీరియస్‌గా స్పందించి చర్యలకు దిగి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. అపుడు తెలంగాణలో బీజేపీ గెలుపు వాతావరణం ఖచ్చితంగా పెరుగుతుంది. అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. గ్రూపు రాజకీయాలు సుఖాంతమవుతాయి. పార్లమెంట్ ఎన్నికలయ్యేనాటికి తెలంగాణలో బీజేపీ ఓటుశాతం19 శాతానికి పెరిగింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హూజూరాబాద్‌లో బీజేపీ సత్తా చాటింది. అలాగే హూజూరాబాద్‌లో ఈటెల రివర్స్ సెంటిమెంట్ కేసిఆర్‌పై వదిలాడు. జీహెచ్‌ఎంసీలో హైదరాబాద్ నగరంలో సగానికి పైగా కాషాయ జెండా ఎగిరింది. ఇక్కడా ఆంధ్రా వ్యాపార లాబీయింగ్ పనిచేసి అమీర్‌పేట నుంచి చందానగర్ వరకు బీజేపీని ఓడించింది.
బీజేపీ అధిష్టానం చొరవ అవసరం
కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సూడో మేధోవర్గం, వ్యాపార అవకాశవాద ఆంధ్రా మీడియా, లాబీయిస్టులపై బీజేపీ పోరాటం చేయాల్సిన సమయమిది. గ్రూపు రాజకీయాలు చేయడం కాదు. జాతీయవాదం బలపడాలి. కేసీఆర్ జిత్తులమారి రాజకీయాలకు గురికావద్దు. ప్రస్తుతం ఏ జాతీయవాది అయినా బీజేపీలో ‘అంతర్గత వర్గ పోరాటం’ అంతం కావాలని కోరుకుంటున్నాడు. అధిష్టానం కూడా తెలంగాణపై కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని జరుగుతున్న పరిణామాలే గుర్తుచేస్తున్నాయి. అవకాశవాద వ్యాపార శక్తులు, బీజేపీ వ్యతిరేక మీడియా, కేసీఆర్ ఎత్తుగడలు బీజేపీ ఎదుగుదలను భరించలేరు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీని, రాష్ట్రంలో అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ నిరంతరం చేస్తూనే ఉంటాడు. కానీ కేంద్ర నాయకత్వం సరైన వ్యూహం ఇస్తేనే ఇక్కడ పని జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ‘చంపడానికి విషం ఇచ్చి, కాలికి తట్టు తగిలిందని పంచాయితీ పెడతాడు’ అన్న విషయం అధిష్ఠానం గ్రహించాలి. పూర్వం నుంచి బీజేపీ ‘నేషన్ ఫస్ట్’ అన్న నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం పార్టీని తోకగా మార్చింది. ఇపుడు దాన్ని పులిలా మార్చాలి. జాతీయవాదం పోయి, వ్యక్తిగత వాదం రావడం బీజేపీ ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అది రాకుండా చూడాల్సిన బాధ్యత జాతీయ నాయకత్వంపై ఉంది. రాష్ట్రంలో బీజేపీ చేసిన అనేక పోరాటాల నుంచి పొలిటికల్ మైలేజీ అందుకోవడం కొంత మేర జరిగింది. కానీ జరగాల్సింది ఇంకా చాలా ఉంది. కేసీఆర్ అవినీతి పై పోరాటమే బీజేపీకి బ్రహ్మాస్ర్తం కాగలుగుతుంది.
ప్రాంతీయపార్టీల కపట రాజకీయాలు
దేశంలో బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని సులభంగా ఆక్రమించింది. ప్రాంతీయ పార్టీల అపభ్రంశపు పనులన్నీ కాంగ్రెస్ మీదే పడ్డాయి. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంశలే. కుటుంబ, కుల పార్టీలే. ఇక్కడ విశేషం ఏమిటంటే బీజేపీ విజృంభణ అంతా ‘కాంగ్రెస్ ముక్తభారత్’ అంటూ కాంగ్రెస్‌పైనే ఎక్కువగా జరిగింది. కొన్ని ప్రాంతీయ పార్టీలను ఆక్రమించలేకపోయింది. మరీ ముఖ్యంగా కుల, ధన, ఎకో సిస్టం ఆధారంగా నడిచే ప్రాంతీయ పార్టీలను కదిలించలేకపోయింది. ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం తన తెలివితేటల ద్వారా తెలుగు ప్రాంతంలో బీజేపీని ఎదగనివ్వలేదు. కారణం ప్రాంతీయ పార్టీల ఎత్తులను జిత్తులను పసికట్టాలంటే యూపి లాగే ప్రత్యేక స్ట్రాటజీ కావాలి.
బీసీల పార్టీగా బీజేపీకే అవకాశం ఉంది
బీసీల పార్టీగా, తెలంగాణ పార్టీగా పేరు తెచ్చుకునే అవకాశం తెలంగాణలో కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. ఆ అవకాశాన్ని ఏమేరకు ఉపయోగించుకుంటారనేదే తెలంగాణలో ఆ పార్టీ స్థిరమైన భవిష్యత్తును నిర్దేశించనుంది. ఇపుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో బీసీ ముఖ్యమంత్రికి అవకాశమే లేదు. 54 శాతానికి పైగా తెలంగాణ ప్రాంతంలోని బీసీలు ఏకతాటిపైకి వస్తే బీజేపీ గెలుపుతో మొదటి సారి బీసీ సీఎం అయ్యే అవకాశం తప్పక ఉంటది. అలాగే జాతీయవాదానికి ‘బీసీ వర్గాలు’ పట్టుకొమ్మగా ఉన్నమాట వాస్తవం. తెలంగాణపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లక పోతే.. అందరూ తర్కవితర్కాల్లో ఉండగా ఎన్నికలు సమీపిస్తే కేసీఆర్‌కే లాభం అన్న లాజిక్ ను బీజేపీ అధిష్టానం గుర్తించాలి. బీజేపీ కేంద్ర నాయకత్వం స్పందించే తీరునుబట్టే ఇక్కడ రాజకీయం ఉంటుంది అని ప్రజల నమ్మకం కూడా.
కాలభైరవుడు