సత్తుపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

సత్తుపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • ఇరు పార్టీల నేతల మధ్య  పరస్పర అవినీతి ఆరోపణలు
  • ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సత్తుపల్లిలో ఉద్రిక్త వాతావరణం

సత్తుపల్లి/వేంసూర్ ,వెలుగు:  కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర అవినీతి ఆరోపణలు చేసుకుంటుండగా సత్తుపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజులుగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్గం నేతలు,  బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే వర్గంనేతలు కామెంట్లు చేసుకుంటున్నారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇరు పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  బీఆర్ఎస్ లీడర్లను వేంసూరు పీఎస్ కు .. కాంగ్రెస్ నేతలను సత్తుపల్లి స్టేషన్ తరలించారు. దీంతో అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కార్యకర్తలతో పాటు   వేంసూర్ స్టేషన్ వద్దకు వెళ్లారు. 

అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..15 ఏండ్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నడూ ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదని గుర్తుచేసుకున్నారు.  ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజా వ్యతిరేకత తీవ్ర మైందని విమర్శించారు. సత్తుపల్లి కి చెందిన ఓ కాంగ్రెస్ నేత   కొడుకు హైదరాబాద్ లో గంజాయి కేసులో పట్టుబడింది వాస్తవం కాదా..?  అని ప్రశ్నించారు. పేకాట, కోడి పందేలు ఆడే కాంగ్రెస్ నేతలు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు.  

నిరూపిస్తే రాజీనామా చేస్తా..  

కాంగ్రెస్ రాష్ట్ర నేత డాక్టర్ మట్టా దయానంద్ కూడా సత్తుపల్లి పీఎస్ కు చేరుకొని పోలీసుల తీరును ఖండించారు. అధికార పార్టీ నేతలను అరెస్టు చేయడమేంటని సీఐ కిరణ్ పై మండిపడ్డారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  క్రికెట్ బెట్టింగ్ లు, బుకీలు, జూదరులను మాజీ ఎమ్మెల్యే ప్రోత్సహించారంటూ ఆరోపణలు చేశారు. తమ అవినీతిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని, లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు. ఇరు పార్టీల నేతల పరస్పర ఆరోపణలతో సత్తుపల్లిలో ఉద్రి క్త పరిస్థితులు తలెత్తాయి.