- రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఖరారు
- నాగర్‌కర్నూల్ క్యాండిడేట్లను ఫైనల్ చేయని కాంగ్రెస్, బీఆర్‌ఎస్
- అగ్రనేతల పర్యటనతో నేతల్లో జోష్
- రెండు ఎంపీ స్థానాల్లో మొత్తం 34.75 లక్షల మంది ఓటర్లు
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ వెలుగు : లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ శనివారం షెడ్యూల్ రిలీజ్ చేయగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల్లో పోటీకి ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. ఇందులో బీజేపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని పెండింగ్ లో పెట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో ఇద్దరు ఎంపీలను గెలిపించాలని పట్టుదలతో ఉండగా.. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు క్యాండిడేట్లు ఒకే..
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నారు. నాగర్కర్నూల్పార్లమెంట్కు బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ క్యాండిడేట్లను కన్‌ఫాం చేయలేదు. బీజేపీ నుంచి నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పి.రాములు తనయుడు పి.భరత్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ క్యాండిడెట్ను ఫైనల్ చేయలేదు.
బీఆర్‌ఎస్, బీఎస్పీ అలయెన్స్‌లో భాగంగా బీఎస్పీకి ఈ సీటుకు కేటాయించినట్లు ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. ఈ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నట్లు టాక్ నడిచింది. అయితే ఆయన అనూహ్యంగా శనివారం బీఎస్పీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన పొత్తులో కాకుండా నేరుగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచే పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్ సభలు
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి జిల్లాల్లో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చల్లా వంశీచంద్ రెడ్డి 'పాలమూరు న్యాయ్ యాత్ర' పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. డీకే అరుణ బీజేపీ 'విజయ్ సంకల్ప్ యాత్ర' పేరుతో పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉండటంతో ముందు నుంచి ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం కొడంగల్ నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇటీవల మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిస్తే, పాలమూరుకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. తాజాగా శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్లో విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కానీ, బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైన లీడర్లు రెండు పార్లమెంట్ల పరిధిలో పర్యటించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఢీలా పడినట్లు తెలుస్తోంది.
అమల్లోకి కోడ్..
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బై ఎలక్షన్స్ ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉండనుంది. అయితే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో శనివారం నుంచి పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 4వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉండనుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,80, 417 మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 8,32,080 స్ర్తీలు 8,48,293 మంది ఉన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో మొత్తం ఓటర్లు 17,34,773 మంది ఉండగా.. పురుషులు 8,64,034 స్ర్తీలు 8,70,694 మంది ఉన్నారు.