టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని అధికార పక్షమైన బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రాజేశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో నిరసనలకు దిగగా.. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్నేతలు వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండి పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఇరు వర్గాల నేతలు పరస్పర నిరసనలకు దిగారు.
కరీంనగర్ రాయపట్నం హైవేపై రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ధర్మారం సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు అడ్లూరి లక్ష్మణ్కుమార్ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా.. గ్రామ బీఆర్ఎస్నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది.