
- వెన్నుపోటు పొడిచే కేసీఆర్ లాంటోళ్లకు అవకాశం ఇవ్వొద్దు
- కర్నాటకలో కన్నా తెలంగాణ గ్యారంటీలే బాగున్నయని కామెంట్
- కాంగ్రెస్ వచ్చినంక కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తం: రేవంత్
- వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగిలో కాంగ్రెస్ బస్సుయాత్ర
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందేనని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. కానీ పదేండ్లయినా కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. వెన్నుపోటు పొడిచే కేసీఆర్ లాంటి నేతలకు అవకాశం ఇవ్వొద్దు. కర్నాటకలో మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హామీలను అమలు చేశాం. కేసీఆర్ పదేండ్లవుతున్నా ఒక్క హామీనీ నెరవేర్చలేదు” అని విమర్శించారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి డీకే శివకుమార్ బస్సు యాత్ర నిర్వహించారు. ఆయా చోట్ల నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడారు. కర్నాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేసి చూపించామని చెప్పారు. గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తున్నామని చెప్పారు.
తాము చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే కర్నాటకలోని ప్రతి ఇంటికీ వెళ్లి అడిగితే తెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే కర్నాటకలానే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కర్నాటక ఐదు గ్యారంటీలకన్నా తెలంగాణ ఆరు గ్యారంటీలు బాగున్నాయని చెప్పారు. ‘‘బీజేపీకి బీటీమ్‌లా బీఆర్ఎస్ మారింది. కేసీఆర్, కేటీఆర్.. కర్నాటకకు వస్తే మేము ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో తెలుస్తుంది. (తాండూర్ నుంచి) కర్నాటక కేవలం పది కిలోమీటర్ల దూరమే. తేదీ, టైమ్ చెప్తే.. మేమే బస్సులో తీసుకెళ్లి చూపిస్తం” అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ చరిత్ర అంటే.. దేశ చరిత్ర అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అన్ని వర్గాల వాళ్లు అధికారంలో ఉన్నట్టేనని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ కోసం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి.. దోపిడీ దొంగ: రేవంత్ రెడ్డి
తాండూరుకు నీళ్లివ్వాలని ఆనాడు వైఎస్ హయాంలో సాగు నీటి ప్రాజెక్టులను తెచ్చుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రజలు భుజాలపై మోసి గెలిపిస్తే వందల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. భూకబ్జాలు, ఇసుక దోపిడీ దొంగను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపిందని మండిపడ్డారు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కాలుదువ్వుకునే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్‌కు తెలిసిపోయింది. అందుకే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ తన ఓటమిని అచ్చంపేటలోనే ఒప్పుకున్నారు. కేసీఆర్.. ఓడితే నీది ఏమీ పోదనుకోకు. నువ్వు మింగిన లక్ష కోట్లు కక్కిస్తాం. నువ్వు ఆక్రమించిన 10 వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటాం. కేటీఆర్ భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? అభివృద్ధికి కాంగ్రెస్ పునాదులు వేస్తే.. మీరు వచ్చి దోచుకున్నారు తప్ప చేసిందేం లేదు” అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
హామీలేమైనయ్ కేసీఆర్?
దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. పరిగికి గోదావరి జలాలు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. ‘‘బెల్లయ్య నాయక్ మా పార్టీ. ఆయనకు టికెట్ ఇవ్వాలని నేను అడుగుతా. కేసీఆర్ ఎవరు అడగడానికి? పీసీసీ అధ్యక్షుడినైన నాపై కేసీఆర్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.