బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.లక్షల కోట్లు అప్పును ప్రధాని నరేంద్ర మోదీ మాఫీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం భూపాలపల్లి జిల్లా కాటారంలో బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో కులగణనపై నేను మాట్లాడాను. దేశంలో కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ను నియంత్రిస్తున్నారు. అందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అదానీ రూ.లక్షల కోట్లు అప్పు తీసుకుంటారు. వాటిని బిజెపి మాఫీ చేస్తోంది. స్వయం ఉపాధి కింద మహిళలు తీసుకున్న రుణాలు మాత్రం బిజెపి మాఫీ చేయదు. ప్రజలు కొనే ప్రతి వస్తువుపై బిజెపి జీఎస్టీ వసూలు చేస్తుంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి అదనీకి కట్టబెడుతున్నారు.
ALSO READ : అవినీతి కేరాఫ్ కాంగ్రెస్ .. రాహుల్ లీడర్ కాదు.. రీడర్ : కేటీఆర్
బిజెపి ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయదు. దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెండు పార్టీలు ఒక్కటే.. నరేంద్ర మోదీ వద్ద కేసీఆర్ చేతులు కట్టుకుని ఉంటున్నాడు. బీజేపీపై ధైర్యంగా పోటీ చేస్తోంది కాంగ్రెస్ మాత్రమే. నాలో ప్రవహించే రక్తం కాంగ్రెస్ పార్టీది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాపై ఎంత కక్ష సాధిస్తే నాకు అంత మంచిది. తెలంగాణ ప్రజలతో నాకున్నది రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ బంధం" అని అన్నారు.