దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగనున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా 2023, అక్టోబర్ 19వ తేదీ గురువారం భూపాలపల్లి జిల్లా కాటారంలో బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.
"దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉంది. తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం చేపట్టాలని ఆశించాం... కానీ తెలంగాణలో అధికారం ఒక్క కుటుంబానికే పరితమైంది. అవినీతి కారణంగా తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెసిఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారు. కెసిఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదు.ఈసారి దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్ ను ఏర్పాటు చేస్తాం. సీఎం, ఆయన కుటుంబం తెలంగాణ సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతాం. కర్ణాటకలో రైతులకు రుణమాఫీ చేశాం. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రాజస్థాన్ లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా కింద రూ.25 లక్షల ప్రయోజనం చేకూర్చాం. అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2,500 వేస్తాం.
తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు. తెలంగాణ ఇస్తామని 2004లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంది. తెలంగాణ ప్రజల స్వాప్నాన్ని సోనియగాంధీ సాకారం చేశారు. తెలంగాణ ప్రజల ధనం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఇప్పుడు చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతాం. మూడెకరాల భూమి ఇస్తామన్న కెసిఆర్ హామీ అమలైందా?. బిజెపిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రల్లో అభ్యర్థులను పోటీ పెట్టి.. బిజెపికి సహకరిస్తోంది. బిజెపి తెచ్చిన ప్రతి చట్టానికి బిఆర్ఎస్ మద్దతు తెలిపింది. " అని విమర్శించారు.