నా వ్యాఖ్యలను వక్రీకరించారు: కొత్త ప్రభాకర్​రెడ్డి

నా వ్యాఖ్యలను వక్రీకరించారు: కొత్త ప్రభాకర్​రెడ్డి

ఎమ్మెల్యేపై పలుపోలీస్​స్టేషన్లలోకాంగ్రెస్ శ్రేణల ఫిర్యాదు
దౌల్తాబాద్​లో కాన్వాయ్ అడ్డుకుని నిరసన..దిష్టిబొమ్మలు దహనం

సిద్దిపేట/దుబ్బాక/కూకట్​పల్లి, వెలుగు:బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కాంగ్రెస్​ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. పలు పార్టీల నుంచి విమర్శలు వస్తున్న  నేపథ్యంలో కొత్త ప్రభాకర్​రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు. మంగళవారం కొత్త ప్రభాకర్​రెడ్డి  దౌల్తాబాద్​లో  జరిగిన బీఆర్ఎస్​సమావేశంలో మాట్లాడారు."

కాంగ్రెస్​పాలనలో  రియల్​ఎస్టేట్​కుంటుపడిందని, ఆపదొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందామన్నా ఎవరూ కొనడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పోతే బాగుండని సామాన్య ప్రజలు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, రైతులు కోరుకుంటున్నారని నేను అన్నారు. స్వచ్ఛందంగా చందాలేసుకుని బీఆర్ఎస్​ను గెలిపించుకుంటామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని మాత్రమే అన్నాను. కాంగ్రెస్​ప్రభుత్వాన్ని మేం కూల్చబోం. ఇదంతా మీడియా సృష్టే" అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి  పేర్కొన్నారు. 

ఎమ్మెల్యేకు నిరసన సెగ

రాయపోల్​పర్యటనను ముగించుకుని దౌల్తాబాద్ లో బీఆర్ఎస్​సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డికి నిరసన సెగ తగిలింది. స్థానిక అంబేద్కర్​చౌరస్తా వద్ద అయన కాన్వాయ్​ను కాంగ్రెస్​ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొగుటలో నియోజకవర్గ ఇన్​చార్జీ చెరుకు శ్రీనివాస్​రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభాకర్​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాయపోల్, అక్భర్​పేట, భూంపల్లి మండల కేంద్రం, దుబ్బాకలోనూ దిష్టిబొమ్మలను దహనం చేశారు.  కూకట్​పల్లి, తోగుట, భూంపల్లి, దుబ్బాకతోపాటు పలు పోలీస్​స్టేషన్లలో  కొత్త ప్రభాకర్​రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణలు ఫిర్యాదు చేశారు.