బీఆర్ఎస్ మేనిఫెస్టో జిమిక్కులు నమ్మొద్దు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు : బీఆర్ఎస్ మేనిఫెస్టో జిమిక్కులు నమ్మొద్దని  తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. పన్నుల రూపంలో ప్రజల దగ్గర దోచుకొని దాచుకున్న డబ్బులో కొంత మొత్తం తిరిగి వారికే ఇచ్చేందుకు కౌరవ సైన్యం లాంటి బీఆర్ఎస్ సిద్ధమైందని..  ఆ డబ్బులు తీసుకొని పాండవ సైన్యం లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దీవించాలని ఆయన కోరారు.

ఆదివారం చుంచుపల్లి మండల కేంద్రం, ఇల్లందు మండలంలోని రొంపెడులో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోతో ఎన్నికల జిమిక్కును రెండు, మూడు రోజులలో ప్రకటించేందుకు సిద్ధమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మొదని ప్రజలకు సూచించారు. గతంలో రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి దానిని తుంగలోకి తొక్కారని విమర్శించారు. ఇప్పుడు అదే హామీని మేనిఫెస్టోలో పొందుపరిచి మభ్యపు హామీతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఓ కొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నారు.

పోడు రైతులనూ బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు పోడు భూముల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. అనంతరం 13 గ్రామ పంచాయితీలకు చెందిన సుమారు 500కు పైగా కుటుంబాల కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు,  జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు,  వివిధ సొసైటీల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.