ఇద్దరు దొరలను ఓడించిన బీసీ నేత

  •     వేములవాడలో కాంగ్రెస్‌‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌‌  విజయం
  •     ఫలించిన 20 ఏండ్ల పోరాటం

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ ​అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావుపై 14,581 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వెలమ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు దొరలను ఓడించి బీసీ నినాదాన్ని చాటారు. 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో ఆది శ్రీనివాస్​ ఓడిపోగా, ఈసారి సానుభూతి, కాంగ్రెస్​ హవా విజయాన్ని తెచ్చి పెట్టాయి.  ఓడిన వారిలో బీజేపీ సీనియర్  లీడర్​, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు బీజేపీ అభ్యర్థి వికాస్ రావుతో పాటు మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు  కొడుకు బీఆర్ఎస్  అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నారు.  

పనిచేయని కేటీఆర్ హామీలు

చల్మెడ లక్ష్మీనరసింహారావును గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్  హామీ ఇచ్చారు. వేములవాడలో చల్మెడ గెలవకపోతే  సిరిసిల్లలో తాను గెలిచినా వేస్టే అని చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గెలిచాక స్థానికంగా ఉండరేమోనన్న అనుమానం ప్రజల్లో ఉండిపోయింది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌బాబు గెలిచాక ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తరచూ జర్మనీ వెళ్లేవారు. దీంతో స్థానికంగా తమ మధ్యలో ఉండే ఆది శ్రీనివాస్ కే ఓటర్లు పట్టం కట్టారు.