అమిత్ షా హోంగార్డులా మాట్లాడారు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 

యాదగిరిగుట్ట, వెలుగు: రాయగిరి బీజేపీ మీటింగ్ లో అమిత్ షా కేంద్ర హోం మినిస్టర్ లా కాకుండా హోంగార్డులా మాట్లాడారని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఇచ్చిన అబద్ధాల చిట్టాలను అమిత్ షా చదివి అబాసు పాలయ్యారని పేర్కొన్నారు.

గురువారంయాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను సంతకాలు ఫోర్జరీ చేశానని ఆరోపిస్తున్న అమిత్ షా.. తన దగ్గరే ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని చెప్పారు. తాను సంతకాలు ఫోర్జరీ చేశానని తేలితే.. దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భువనగిరి ఎంపీ టికెట్ తన చెంచాకు ఇచ్చాడని తనను ఉద్దేశించి వ్యాఖ్యానించిన అమిత్ షా.. జంప్ జిలానీ అయిన బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

తాను ఎవరి చెంచాను కాదని, ఇరవై ఏండ్లు కాంగ్రెస్ కు సేవ చేశానని, తన సేవలను గుర్తించే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖామన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, రాష్ట్ర నాయకుడు జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.