ఆదిలాబాద్​లో బీజేపీ ..పెద్దపల్లిలో కాంగ్రెస్

  • గొడం నగేశ్, వంశీకృష్ణ జయకేతనం
  • ఆదిలాబాద్​లో చరిత్ర సృష్టించిన కమలం
  • వరుసగా రెండోసారి విజయం
  • గతంతో పోలిస్తే పుంజుకున్న కాంగ్రెస్
  • మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ 
  • మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షం
  • ఏ దశలోనూ పోటీ ఇవ్వని బీజేపీ, బీఆర్ఎస్​
  • ప్రతి రౌండ్​లోనూ వంశీకృష్ణ

ఆదిలాబాద్/కోల్​బెల్ట్, వెలుగు:  ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో వరుసగా రెండోసారి ఒకే పార్టీ ఎంపీగా గెలవడం ఇదే మొదటిసారి. గొడం నగేశ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

 ఈవీంల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే బీజేపీ అధిక్యత కనబర్చింది. బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆపార్టీ మెజార్టీ సాధించగా.. బీఆర్​ఎస్ ​ఎమ్మెల్యేలు ఉన్న ఆసిఫాబాద్, బోథ్​లో ఆ పార్టీకి మెజార్టీ దక్కలేదు. ఆసిఫాబాద్​లో కాంగ్రెస్​కు మెజార్టీ వచ్చింది. మొత్తం 23 రౌండ్లకు గానూ గొడం నగేశ్​కు 5,68,168 ఓట్లు రాగా, ఆత్రం సుగుణకు 4,77,516, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 1,37,300 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్​లో బీఆర్ఎస్​కు 837, కాంగ్రెస్​కు 5,183, బీజేపీకి 9,232 ఓట్లు వచ్చాయి. 

ఓడించిన పార్టీనే గెలిపించింది

2019 పార్లమెంట్ ఎన్నికల్లో గొడం నగేశ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో నగేశ్ ఓడిపోయారు. ఐదేండ్లు తర్వాత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరిన నగేశ్ ఎంపీగా గెలిచారు. దీంతో అప్పుడు ఓడించిన పార్టీనే ఐదేండ్ల తర్వాత ఆయన్ను గెలిపించింది. సోయం బాపురావు, నగేశ్​ ఇద్దరు కూడా ఇతర పార్టీల నుంచి ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి గెలుపొందడం విశేషం. 20 ఏండ్లలో ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి వరుసగా గెలవలేదు. బీజేపీ ఆ రికార్డును బద్దలుకొట్టింది. 

పుంజుకున్న కాంగ్రెస్..

గత 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ 3,77,374 ఓట్లు సాధించింది. బీఆర్ఎస్​కు 3,18,814 ఓట్లు రాగా, కాంగ్రెస్​కు 3,14,238 ఓట్లు వచ్చాయి. బీజేపీ 58,560 ఓట్లు మెజార్టీతో గెలిచింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఈసారి పుంజుకుంది. గతంలో 3.14 లక్షల ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 4.76 లక్షలకు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​కు  కేవలం 2,52,286 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఐదు నెలల్లోనే కాంగ్రెస్​పుంజుకొని భారీగా ఓట్లను రాబట్టింది. 

బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో ఆ పార్టీకి 4,65,476 ఓట్లు రాగా ఐదు నెలల్లోనే ఏకంగా 3.30 లక్షల ఓటర్లను కోల్పోయింది. ఏ అసెంబ్లీ సెగ్మెంట్​లోనూ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,21,763 ఓట్లు పోలవగా. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కుకు 1,37,300 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ గల్లంతైంది. 2018 ఎన్నికల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గా గెలిచిన ఆత్రం సక్కుకు 2023లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయనకు డిపాజిట్ దక్కలేదు.

పెద్దపల్లిలో తిరుగులేని వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్​స్థానంలో కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. 1,31,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఓటర్లు బీజేపీ, బీఆర్​ఎస్​కు షాక్​ ఇచ్చారు. తక్కువ మెజార్టీతోనైనా తామే గెలుస్తామని భావించిన రెండు పార్టీల అభ్యర్థులు ఏ రౌండ్​లోనూ ఆధిక్యం దక్కలేదు. 

ప్రతి రౌండ్​లో వంశీకృష్ణ అధిక్యం చూపుతూ విజయ తీరాలకు చేరారు. ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఆయనకు  69,679  ఓట్ల భారీ మోజార్టీ దక్కింది. పోస్టల్​ బ్యాలెట్​లోనూ కాంగ్రెస్​కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఓటమి ముందే ఊహించిన బీజేపీ, బీఆర్ఎస్ ​అభ్యర్థులు మంచిర్యాలలోని ఐజా కాలేజ్​లోని కౌంటింగ్ ​కేంద్రం ​వైపు రాకుండా ముఖం చాటేశారు. ఆ పార్టీల కౌంటింగ్​ఏజెంట్లు సైతం మధ్యాహ్నం 12 గంటలకే సెంటర్​నుంచి వెళ్లిపోవడం కనిపించింది.

రౌండ్​రౌండ్​కు వంశీకృష్ణకు లీడ్..

చెన్నూర్ నియోజకవర్గంలో వంశీకృష్ణకు 59489 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్​కు 33775, బీఆర్ఎస్​ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్​కు 26748 ఓట్లు వచ్చాయి. వంశీకృష్ణకు 25,714 ఓట్ల మోజార్టీ దక్కింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కించగా మొదటి రౌండ్​ నుంచి చివరి రౌండ్​ వరకు గడ్డం వంశీ కృష్ణ అధిక్యంలోనే కొనసాగారు. ప్రత్యర్థులు ఎక్కడా కూడా లీడ్​ సాధించలేకపోయారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్​కు ఓటర్లు పట్టం కట్టారు. వంశీకృష్ణ 57,157 ఓట్లు సాధించగా, గోమాస శ్రీనివాస్​కు 32,577 ఓట్లు, ఈశ్వర్​కు 22,453 ఓట్లు వచ్చాయి. 

గోమాస శ్రీనివాస్​పై వంశీ 24,580 ఓట్ల మోజార్టీ దక్కించుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ వంశీకృష్ణ హవా కొనసాగింది. ఆయనకు 79,101 ఓట్లు రాగా గోమాసకు 59,716 ఓట్లు, కొప్పులకు 21,614 ఓట్లు వచ్చాయి. వంశీకృష్ణ 19,385 ఓట్ల మోజార్టీ దక్కించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలో మొత్తంగా వంశీకృష్ణకు 4,75,587 ఓట్లు రాగా, గోమాస శ్రీనివాస్​కు 3,44,223 ఓట్లు, ఈశ్వర్​కు 1,93,356 ఓట్లు వచ్చాయి.