ప్రజా సేవ కోసమే బెల్లంపల్లికి వచ్చా : గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు : ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బెల్లంపల్లిలో కాంగ్రెస్​అభ్యర్థి అభ్యర్థి గడ్డం వినోద్, ఆ పార్టీ లీడర్లు ప్రచారంలో స్పీడ్ పెంచారు. బెల్లంపల్లి పట్టణంతోపాటు, నియోజకవర్గంలోని మండలాల్లో ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం పట్టణంలోని హనుమాన్, రడగంబాల బస్తీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వినోద్ పాల్గొనగా ఆయనకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినోద్​మాట్లాడుతూ.. తాను ప్రజలకు సేవ చేసేందుకే బెల్లంపల్లికి వచ్చానని, నియోజకవర్గాన్ని అన్ని  విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరుతున్నారని, వారి రాకతో పార్టీ మరింత బలంగా మారిందన్నారు. బీఆర్ఎస్ లీడర్లు చెప్పే అబద్ధపు హామీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా 28వ వార్డుకు చెందిన 50 మంది యవకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి వినోద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, లీడర్లు ఎంఏ నయీం, రామగిరి శ్రీనివాస్, అబ్దుల్ రఫీ, లింగంపెల్లి రవితేజ, రాళ్లబండి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.  

అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం

బెల్లంపల్లి రూరల్ : కాంగ్రెస్​కు ఓటేసి గెలిపిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గడ్డం వినోద్​అన్నారు. బెల్లంపల్లి రూరల్​కన్నెపల్లి మండల కేంద్రంతోపాటు ముత్తాపూర్, మెట్​పల్లి, నాయకునిపేట, లింగాల, జజ్జరవెల్లి, రెబ్బెన, జన్కాపూర్ గ్రామపంచాయతీల్లో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తనకు ఓటేసి గెలిపిస్తే స్థానికంగానే ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

బీఆర్ఎస్​లీడర్లు భూ కబ్జాలకు పాల్పడుతూ కోట్లు దండుకున్నారని వారికి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకులు మాదవరపు నర్సింగరావు, రామాంజనేయ, భట్టు శ్రీను, సత్యగౌడ్, గొమాస డాగయ్య, చంద్రయ్య, అజ్జు, కార్యకర్తలు పాల్గొన్నారు.