బీఆర్ఎస్ కుటుంబ పార్టీ.. లక్షల కోట్లు దోచుకున్న పార్టీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. ఏనాడు పట్టించుకోలేదన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్యలపై మాట్లాడినా ఒక్క పని కూడా చేయలేదని చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామా దెబ్బకు గట్టుప్పల్ ను మండలంగా ఏర్పాటు చేశారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజ్ గోపాల్ రెడ్డితో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, గట్టుప్పల్ మండలం కాంగ్రెస్, సీపీఐ నాయకులు కూడా పాల్గొన్నారు.

మీ భవిష్యత్తు కోసం.. మీ పిల్లల భవిష్యత్తు కోసం.. మీ మండలం కోసం కొట్లాడిన వ్యక్తికి ఓటేస్తారా..? ఓటుకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పే వ్యక్తికి ఓటేస్తారా..? ఆలోచన చేయండి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తాను దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పారు. తన జీవితంలో అబద్ధం ఆడలేదని, ఎవర్నీ మోసం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కుటుంబ పార్టీ.. లక్షల కోట్లు దోచుకున్న పార్టీ.. పేదల బతుకులు నాశనం చేసిన పార్టీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని పిల్లల బతుకులు బాగుపడాలంటే.. ఉద్యోగాలు రావాలంటే చేతి గుర్తుపై ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారంటీ పథకాలతో పేదల బతుకులు మారబోతున్నాయని చెప్పారు.