- అమ్ముడుపోయిన సురేందర్‌కు తగిన గుణపాఠం చెప్తాం
- డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడబోతుంది
- ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్
ఎల్లారెడ్డి, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచి బీఆర్ఎస్కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌లో ఎల్లారెడ్డి టికెట్మదన్కు కేటాయించిన నేపథ్యంలో ఆదివారం ఎల్లారెడ్డికి వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీస్వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవడానికి ఈ సారి ప్రజలు సిద్ధంగా లేరని, చైతన్యవంతమైన ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామన్నారు. ఎమ్మెల్యే జాజాల కమీషన్ల కోసమే పనిచేస్తున్నారే తప్ప అభివృద్ధి కోసం కాదన్నారు. నియోజకవర్గంలో పదేండ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్ గ్రామాల్లో ఓట్లు అడగడానికి వెళ్తే ప్రజలు అడ్డుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్లు, ఇతర పార్టీల లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు.