బీఆర్ఎస్​కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే : కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​రావు

  • నన్ను ఓడించేందుకు ఇద్దరు ఒక్కటయ్యారు
  • నా గెలుపును ఎవ్వరూ ఆపలేరు

లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్​ గెలుపును అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని, బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కాంగ్రెస్​అభ్యర్థి మదన్​ మోహన్​రావు పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిసినా ఎల్లారెడ్డిలో తనను ఓడించలేరన్నారు. గురువారం ఆయన లింగంపేట మండలంలోని కంచ్​మల్, కొండాపూర్, మంబాజీపేట, కొండాపూర్​ తండా, భవానీపేట, జల్దిపల్లి, రాంపూర్, బానాపూర్, బానాపూర్​తండా, బాయంపల్లి, కొర్పోల్, నల్లమడుగు, నల్లమడుగు తండా, రాంపల్లి, రాంపల్లి తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మధ్యాహ్నం ఎల్లారెడ్డి టౌన్​లో జరిగిన మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్​ పార్టీ మాత్రమే ఆలోచిస్తోందని, కాంగ్రెస్​హయాంలోనే ఈ వర్గాలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. మైనార్టీలు కాంగ్రెస్ కు పట్టం కట్టి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధిచెప్పాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో కులగణన ఆధారంగా మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని, వారి సంక్షేమం కోసం రూ.4 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.

ఉర్దూ మీడియంలో ఖాళీగా ఉన్న టీచర్ ​పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న జాజాల సురేందర్​ మైనార్టీల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. ఎల్లారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో విజయం సాధస్తాననే  ధీమా ఉందన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వడగండ్ల ధాటిని పంట నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించిన సీఎం, ఎవరికి రూపాయి ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్​లో చేరికలు

నాగిరెడ్డిపేట,రాజంపేట మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు గురువారం మదన్​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్​ సింగిల్ ​విండో చైర్మన్​ఆకిడి గంగారెడ్డి, రాజంపేట మండలం ఆర్గోండ విండో చైర్మన్​ కంది శివరాములు, డైరెక్టర్లు బుట్టరాజు, బండారి సాయిలు, పులి రాజవ్వ,లంబాడీ మాలీ, లింగంపేట మండల బీజేపీ ఉపాధ్యక్షుడు నరేశ్​గౌడ్​తదితరులను మదన్​మోహన్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో లీడర్లు సంతోష్ రెడ్డి, బుర్ర నారాగౌడ్, ఎల్లమయ్య, రఫియోద్దీన్, జొన్నల రాజు, మాకం రాములు, అన్నం సాయిలు, గుర్రం కిష్టయ్య, దశరథ్​నాయక్ ఉన్నారు.

ALSO READ : కాంగ్రెస్​ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్​రెడ్డి