నాగర్​కర్నూల్​ కాంగ్రెస్ దే .. మూడోసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి

నాగర్​కర్నూల్​ కాంగ్రెస్ దే .. మూడోసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి
  • అచ్చంపేట, కొల్లాపూర్  నియోజకవర్గాల నుంచే భారీ లీడ్​

నాగర్​కర్నూల్,​ వెలుగు: నాగర్​ కర్నూల్​ ఎంపీగా కాంగ్రెస్​ క్యాండిడేట్​ మల్లు రవి మూడోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్​ ప్రసాద్​పై  94,414 ఓట్ల మెజారిటీ సాధించారు. అచ్చంపేట, కొల్లాపూర్​ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ పార్టీకి 78 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గాల్లో మెజార్టీ రాగా, గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. బీఆర్ఎస్​ అభ్యర్థి ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​తన సొంత నియోజకవర్గం అలంపూర్​లో ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ అభ్యర్థి భరత్​ ప్రసాద్​ అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన వాడైనా కోలుకోని దెబ్బ తగిలింది.

సాఫీగా ఓట్ల లెక్కింపు.. 

పట్టణంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్  యార్డులో  కట్టుదిట్టమైన భద్రత నడుమ మంగళవారం లెక్కింపు జరిపారు. కలెక్టర్  ఉదయ్ కుమార్  నేతృత్వంలో వనపర్తి, గద్వాల కలెక్టర్లు తేజస్  నందలాల్  పవార్, సంతోష్ కుమార్, అడిషనల్​ కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, సంచిత్ గంగ్వార్, అపూర్వ చౌహాన్  కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్  జైవన్షీ, సత్పాల్  శర్మ ఓట్ల లెక్కింపు తీరును నిశితంగా పరిశీలించారు. కౌంటింగ్  అనంతరం  తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించి, ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్​  అభ్యర్థి మల్లు రవికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 

ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే బీఆర్ఎస్​ అభ్యర్థి ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ కౌంటింగ్​ కేంద్రం నుంచి  వెళ్లిపోయారు. ఎంపీగా గెలిచిన మల్లు రవికి బీజేపీ అభ్యర్థి భరత్​ప్రసాద్​ అభినందనలు తెలిపారు. ఇదిలాఉంటే మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించడం, కాంగ్రెస్​కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండడం మల్లు రవికి కలిసొచ్చింది. ఎంపీగా గెలిచిన అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి తదితరులు అభినందించారు. అనంతరం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ప్రజలకు ధన్యవాదాలు..​

బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన తనకు ఓట్లేసిన ప్రజలకు భరత్​ ప్రసాద్​ కృతజ్ఞతలు తెలిపారు. మోదీని మూడోసారి ప్రధాని చేయాలన్న సంకల్పంతో ప్రజలు తనకు లక్షల సంఖ్యలో ఓటేసి ఆశీర్వదించారని తెలిపారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.