ఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!

ఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!
  •    వనపర్తిలో కాంగ్రెస్​ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో నిరంజన్​రెడ్డి పరాజయం

వనపర్తి, వెలుగు : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుడంటే ఇదే!  మొన్నటిదాకా ఓ మామూలు ఎంపీపీగా ఉన్న వ్యక్తి, ఏకంగా మంత్రిని ఓడించడం సంచలనంగా మారింది. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా బరిలో నిలిచిన  పెద్దమందడి మండల పరిషత్​ అధ్యక్షుడు బీఆర్ఎస్ అభ్యర్థి మేఘారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు.  

బీఆర్​ఎస్​లో ఉన్న మేఘారెడ్డి మంత్రితో విభేదించి  ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్​లో చేరాడు.  ఆ పార్టీ టికెట్​ కోసం  సీనియర్ ​నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డితో మేఘారెడ్డి పోటీపడ్డారు.  మొదట చిన్నారెడ్డికి టికెట్​ కేటాయించిన కాంగ్రెస్​ హైకమాండ్, తర్వాత మనసు మార్చుకుంది. ఇంటర్నల్​ సర్వేలో చిన్నారెడ్డికి వ్యతిరేకంగా రిపోర్టు రావడంతో 

వనపర్తి టికెట్​ను మేఘారెడ్డికి కేటాయించింది.  కొద్దికాలంలోనే కాంగ్రెస్  శ్రేణులను, అభిమానులను కూడగట్టుకున్న మేఘారెడ్డి కొండలాంటి మంత్రి నిరంజన్​రెడ్డిని  ఢీకొట్టి ఏకంగా  25 వేల మెజారిటీతో విజయం సాధించారు.  బీఆర్ఎస్ లోని గ్రూపులు, మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా నిరంజ్​రెడ్డికి మైనస్ అయ్యాయి.  కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి1,05,469  ఓట్లు రాబట్టగా  మంత్రి నిరంజన్ రెడ్డి 81,269 ఓట్లకు పరిమితమయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి  9,032 ఓట్లు సాధించారు.