ఆర్మూర్, వెలుగు: తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏడాదిలో ఆర్మూర్ ను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ లో మైనార్టీలను కలిసి చేతిగుర్తుకు ఓటేసి, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్థానికుడినైన తనకు లోకల్సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రెండుసార్లు జీవన్ రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే, ప్రజలకు సేవ చేయకుండా అక్రమంగా కోట్లు గడించారని విమర్శించారు.
ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని జీవన్ రెడ్డి ఆర్మూర్, అంకాపూర్, హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో హైటెక్ బంగ్లాలు నిర్మించుకున్నాడన్నారు. ఆర్మూర్ లో ఆర్టీసీ జాగా కబ్జా చేసి షాపింగ్ మాల్ కట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. లీడర్లు యాల్ల సాయిరెడ్డి, సాయిబాబాగౌడ్, మహమూద్ అలీ, కోల వెంకటేశ్, సత్యనారాయణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు