- పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్/ కూసుమంచి, వెలుగు : మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ను ఓటు ద్వారా తరిమికొట్టాలని ప్రజలకు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తిరుమలాయపాలెం మండలం బీరోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. స్వలాభం కోసం ఎమ్మెల్యే కందాల బీఆర్ఎస్లో చేరాడన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అన్నారు.
ఈ యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం కోసం, మీ శ్రీనన్న గెలుపు కోసం హస్తం గుర్తుపై ఓటు వేసి కేసీఆర్ చెంప చెళ్లుమనే సమాధానం చెప్పాలని పొంగులేటి కోరారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసేనని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ మంగీలాల్, రామసహాయం నరేశ్ రెడ్డి, చావా శివరామకృష్ణ, కొప్పుల అశోక్, శ్యాం సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.