
హుస్నాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్‌ను మళ్లీ నమ్మితే గొంతు కోస్తడని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో బీజేపీ నాయకుడు అక్కు శ్రీనివాస్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు పూదరి శ్రీనివాస్, పోలవేని కృష్ణ, గుగ్లోత్ రాజు, చొక్కం గణేశ్, జున్నోజు శ్రీకాంత్, అనువోజు ఆంజనేయులు, పోలోజు రవీందర్, అన్నబోయిన శ్రీకాంత్, సావుల వెంకట్, గట్టు శ్రీనివాస్, హరీశ్, మహేశ్, సంపత్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ధరణి పోర్టల్ తో పేదల భూములను కాజేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తుందన్నారు. దళిత బంధు పేరు చెప్పి మళ్లీ దళితుల్ని మోసం చేశారన్నారన్నారు. రైతులకు ఒకేసారీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల బతుకులను ఆగం జేస్తారని ఆయన మండిపడ్డారు.
చాడ వెంకటరెడ్డితో పొన్నం భేటీ
తమతో కలిసిరావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం ఆయన వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు అంశంతోపాటు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను చర్చించారు.