మెజార్టీ 50 వేలు తగ్గితే రిజైన్ చేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మఠంపల్లి, వెలుగు: హుజూర్‌‌నగర్‌‌లో 50 వేల మెజార్టీతో గెలుస్తానని, లేదంటే తన పదవికి రిజైన్ చేస్తానని ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం రఘునాధపాలెం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  హుజూర్‌‌నగర్‌‌లో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప బీఆర్‌‌ఎస్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు తాగునీరు సరఫరా చేయించిన ఘనత తనకే దక్కుతుందన్నారు. అంతకుముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు  కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మంజీనాయక్,  నాయకులు సామల శివారెడ్డి, సింగారపు సైదులు పాల్గొన్నారు.