షాద్ నగర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. షాద్ నగర్లో ఆ పార్టీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు. గురువారం కేశంపేట మండలంలోని పడమటి గడ్డ తండా, అవాజ్ మియా పడకల్, పాపిరెడ్డి గూడ, రాళ్లగడ్డ తండా, ఇప్పలపల్లి, దత్తాయపల్లి,చౌదర్ గుడా, వేముల నర్వ చింతకుంట పల్లి, కొండారెడ్డి పల్లె, పోమల్ పల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో జరిగిన రోడ్ షోలు, సభలకు కాంగ్రెస్ కార్యకర్తలు, జనం భారీ ఎత్తున తరలివచ్చారు. గజమాలతో నాయకులను సన్మానించారు. అనంతరం వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కుటుంబ పాలనతో జనం విసిగిపోయారన్నారు. షాద్నగర్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని వీర్లపల్లి శంకర్ కోరారు. ఆయన వెంట జడ్పీటీసీలు తాండ్రి విశాల, పి. వెంకట్రామి రెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.