జైపూర్ పవర్ ప్లాంట్ తెచ్చింది కాకానే : వివేక్​ వెంకటస్వామి

  • చెన్నూర్​ కాంగ్రెస్ ​అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు : జైఫూర్​లో 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను తీసుకువచ్చిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందని ఆయన కుమారుడు, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని సింగరేణి ఏరియా స్టోర్స్​లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంయూక్తంగా నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. జైపూర్ పవర్ ప్లాంట్ రాకతో 5 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.

సింగరేణి సంస్థ నష్టాల బాటలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి రూ.600 కోట్లు అప్పు ఇప్పించి సంస్థను కాపాడడంతో పాటు, లక్ష మంది సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కార్మికుల పెర్క్స్​పై ఇన్​కమ్​ ట్యాక్స్​ను సింగరేణి భరించేలా ఒప్పందం చేయిస్తామని చెప్పారు.

సింగరేణి ఖాళీ క్వాటర్స్​ను రిటైర్ట్ కార్మికులకు కేటాయించేలా చొరవ తీసుకుంటానని వివేక్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, సలేంద్ర సత్యనారాయణ , భీమనాథుని సుదర్శనం, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య , మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, మిట్ట సూర్యనారాయణ, నరేందర్, బత్తుల వేణు తదితరులు పాల్గొన్నారు.

చెన్నూర్​లో భారీ ర్యాలీ..

వివేక్ వెంకటస్వామికి మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు చెన్నూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జలాల్ పెట్రోల్ పంప్ నుంచి బస్టాండ్ మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల మేర పాత ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు స్థానికులతో పాత ఎమ్మార్వో ఆఫీస్​ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

వివేక్ వెంకటస్వామితోపాటు, ఆయనకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన తీన్మార్ మల్లన్నను చూసేందుకు జనం పోటీ పడ్డారు. చుట్టుపక్కల ఉన్న భవనాలు, ఇండ్లు, వాటర్ ట్యాంక్ లపైకెక్కి మరీ ర్యాలీని చూశారు.

కాంగ్రెస్​లో చేరికలు

జైపూర్ :  జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ కు చెందిన మాజీ సర్పంచ్ రిక్కుల లక్ష్మీనారాయణతో పాటు 100 మంది యువకులు గంగిపల్లి గ్రామ సర్పంచి పాలమాకుల లింగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. చెన్నూర్​ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో వీరికి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్​బలోపేతానికి తామంతా కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు.

వివేక్​ వెంకటస్వామిని గెలిపించాలి

చెన్నూర్​లో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని జైపూర్ మండలంలోని షెట్​పల్లి గ్రామంలో కాంగ్రెస్​ లీడర్లు, మహిళా కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారం చేశారు. నేతలు తాళ్లపల్లి కిరణ్ గౌడ్

అన్నం వెంకన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు. లీడర్లు శ్రావణ్ గౌడ్, తిరుపతి గౌడ్, శ్రీనివాస్, ప్రశాంత్,  బోండ్ల రాజుతోపాటు భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.