ఢిల్లీలో కాంగ్రెస్‎ కీలక నేతల వెనకంజ.. ఫలించని అగ్రనేతల ప్రచారం..

ఢిల్లీలో కాంగ్రెస్‎ కీలక నేతల వెనకంజ.. ఫలించని అగ్రనేతల ప్రచారం..

న్యూఢిల్లీ: దశాబ్ధం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‎కు దేశ రాజధానిలో మరోసారి నిరాశే ఎదురవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి పునర్ వైభవం దక్కించుకోవాలనుకున్న హస్తం పార్టీ ఆశలు ఈ సారి కూడా అడియాశలు అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తేలిపోయింది. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్.. కేవలం ఒక్క చోట మాత్రమే అధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు కూడా  వెనకంజలో కొనసాగుతున్నారు. 

సందీప్ దీక్షిత్, అల్కా లాంబా, ఆరియా ఖాన్ వంటి నేతలు వెనకబడిపోయారు. ఒక్క బద్లీ స్థానంలోనే కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్‎లో ఉన్నారు. అక్కడ స్వల్ప అధిక్యంలోనే. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ సత్తా చాటలేకపోయాడు. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక్కడ మొదట బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అధిక్యం కనబర్చగా.. రౌండ్లు మారే కొద్ది కేజ్రీవాల్ లీడింగ్ లోకి దూసుకువచ్చారు. మరో కాంగ్రెస్ కీలక నేత అల్కా లంబా కూడా వెనబడిపోయారు. 

ఢిల్లీ సీఎం అతిశీకి పోటీగా కల్కాజీ నుంచి బరిలోకి అల్కా లాంబా ఎదురీదుతున్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ భిదూరి స్పష్టమైన అధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. మిగతా చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో దేశ రాజధానిలో తిరిగి సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్‎కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కీలక నేతలు ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్‎కు కలిసి రాలేదు.