తేలని అభ్యర్థిత్వం.. రోజుకో ఊహాగానం

తేలని అభ్యర్థిత్వం.. రోజుకో ఊహాగానం
  • కాంగ్రెస్ ​టికెట్​ కోసం అన్ని నియోజకవర్గాల్లో ఎదురుచూపులు
  • ఢిల్లీలో మకాం వేసి, ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న హస్తం లీడర్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ​ అభ్యర్థిత్వాలు ఇంకా ఖరారు కాలేదు. దీంతో  కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఎవరు బరిలో నిలుస్తారనే విషయమై ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు అభ్యర్థిత్వాల ఖరారు ఆలస్యమవుతుండగా, మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కొత్త లీడర్లు వస్తున్నారంటూ రోజుకో ఊహాగానం వెలువడుతోంది. ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న కొందరు లీడర్లు ఢిల్లీలోనే మకాం వేశారు.

పార్టీ ముఖ్య నేతల్ని కలుస్తూ, తమ పేర్లు ఖరారు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఎన్నికల స్క్రీనింగ్​కమిటీ బుధవారం ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యింది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై తీవ్రస్థాయిలో చర్చించారు. సర్వేలతో పాటు, స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాల ప్రస్తావన చర్చకు వచ్చినట్లు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. 

కామారెడ్డిలో..

కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన ఫస్ట్​లిస్ట్ లో కామారెడ్డి నుంచి పోటిచేసే అభ్యర్థి పేరు ఖరారవుతుందని అంతా భావించారు. ఇక్కడ బీఆర్ఎస్​ నుంచి సీఎం కేసీఆర్ ​పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ ​నుంచి మాజీ మంత్రి, సీనియర్ ​నేత షబ్బీర్​అలీ పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. అనంతరం రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కామారెడ్డిలో తానే పోటీలో ఉంటానని, బీఆర్ఎస్​తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని షబ్బీర్ ​అలీ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో స్ర్కీనింగ్​కమిటీ భేటీ ఉన్నప్పటికీ షబ్బీర్​అలీ బుధవారం స్థానికంగానేఉన్నారు. 

ఎల్లారెడ్డిపై వీడని ఉత్కంఠ

ఎల్లారెడ్డి టికెట్​ కోసం వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, కె. మదన్​మోహన్​రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ అభ్యర్థిత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. సుభాష్​రెడ్డి కోసం రేవంత్​రెడ్డి, షబ్బీర్​అలీ పట్టుబడుతుండగా, మదన్​మోహన్​రావు కోసం పార్టీ సీనియర్​ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మదన్​మోహన్​రావు బుధవారం ఢిల్లీలోనే ఉన్నారు. మరో వైపు సుభాష్​రెడ్డి హైదరాబాద్​లో రేవంత్​రెడ్డితో పాటు ఇతర నేతల్ని కలిశారు. 

జుక్కల్​లోనూ..

జుక్కల్​ నియోజకవర్గ టికెట్​ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ ​గంగారం, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. జుక్కల్​లో సిట్టింగ్​ఎమ్మెల్యే హన్మంత్​షిండే బీఆర్ఎస్ ​నుంచి బరిలో నిలువనుండగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పోటీలో ఉంటారు.

ALS0 READ: వడ్ల కొనుగోళ్లకు రెడీ.. నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు 

బాన్సువాడలో కొత్తవారు వస్తారని ప్రచారం

బాన్సువాడలో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ ​భావిస్తోంది. టికెట్ ​కోసం అప్లయ్​చేసుకున్న వారు కాకుండా కొత్తవారి పేర్లను అధిష్టానవర్గం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.
ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్​లో చేరితే, ఆయన్ను ఇక్కడి నుంచి బరిలో దింపుతారని ప్రచారం సాగుతోంది. నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య లీడర్​ కూడా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల నియోజకవర్గ కేంద్రంలో భేటీ అయిన ఇక్కడి లీడర్లు స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్​చేశారు.