రేవంత్​రెడ్డిపై కేసు..ఎవరు ఫిర్యాదు చేశారంటే..

రేవంత్​రెడ్డిపై కేసు..ఎవరు ఫిర్యాదు చేశారంటే..

నాగర్ కర్నూల్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి నాగర్​కర్నూల్​పీఎస్​లో కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుంటామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి చెల్లిస్తామని కామెంట్స్​చేసిన సంగతి తెలిసిందే.

క్షమాపణలు చెప్పాలి 

సూర్యాపేట: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరును సూర్యాపేట పోలీస్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య గౌడ్ ఖండించారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులకు రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల అంతు చూస్తామని బెదిరిస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఏ ప్రభుత్వం ఉన్న చట్టానికి లోబడి పని చేస్తుందని అలాంటి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.