మోదీ నైతికంగా ఓడిపోయారు: సోనియా గాంధీ

మోదీ నైతికంగా ఓడిపోయారు: సోనియా గాంధీ
  • నాయకుడిగా ఉండే హక్కును కోల్పోయారు: సోనియా గాంధీ
  • ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు 
  • ఇకపై కాంగ్రెస్ ఎంపీలంతా అలర్ట్ గా ఉండాలి
  • మోదీ సర్కార్ జవాబుదారీగా ఉండేలా చూడాలని పిలుపు 
  • కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యాక స్పీచ్ 

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి ‘రాజకీయంగా, నైతికంగా ఓటమి’ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అన్నారు. నాయకుడిగా ఉండే హక్కును కోల్పోయినా.. ఆయన మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ప్రెసిడెంట్ గా సోనియాను ఆ పార్టీ ఎంపీలు వాయిస్ ఓట్ ద్వారా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు.

అనంతరం పార్టీ ఎంపీలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.  ‘‘ఎన్నికల్లో తనను చూసి ఓటు వేయాలని మోదీ కోరారు. పార్టీని, మిత్రపక్షాలను పక్కనపెట్టారు. వాస్తవానికి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఆయన రాజకీయంగా, నైతికంగా ఓడిపోయారు. నాయకత్వం వహించే హక్కును కోల్పోయారు. అయినా ఓటమికి బాధ్యత వహించకుండా ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు.

ఆయన పరిపాలనలో మార్పు వస్తుందని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని మనం అనుకోరాదు. అందుకే సీపీపీ సభ్యులంతా అలర్ట్ గా ఉండి, గమనిస్తూ ఉండాలి. మోదీని, ఎన్డీయే సర్కారును జవాబుదారీ వహించేలా కట్టడి చేయాలి. ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు” అని సోనియా స్పష్టం చేశారు. గత పదేండ్లలో పార్లమెంట్ ను అడ్డుకున్నారని, బిల్లులు, చట్టాలపై తగిన చర్చలు లేకుండానే పాస్ చేసుకున్నారని.. ఇకపై ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాలన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సెక్యులర్, డెమోక్రటిక్ విలువలను నాశనం చేయడం, విభజన రాజకీయాలతో పోలరైజేషన్ చేయడం వంటి ప్రయత్నాలను నివారించాలని చెప్పారు. 

రాహుల్ జోడో యాత్రలు చరిత్రాత్మకం..  

లోక్ సభ ఎన్నికల్లో విభజన, ఆటవిక రాజకీయాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు ఓటు వేశారని సోనియా అన్నారు. ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎంతో ధైర్యంతో పోరాడారని, పార్టీ ఎంపీల సంఖ్యను గణనీయంగా పెంచారని ఆమె మెచ్చుకున్నారు. భారత్ జోడో యాత్రలు చరిత్రాత్మకమైన క్షణాలుగా నిలిచాయని, ఎంతో డెడికేషన్ తో పోరాటం చేసిన రాహుల్ గాంధీకి పార్టీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ హామీ ఇచ్చిన గ్యారంటీలను, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరాన్ని ఆయన ప్రజలకు బాగా వివరించి చెప్పారన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలలో పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పాత్ర కూడా గణనీయంగా ఉందన్నారు.