సోనియా గాంధీ వల్లే తెలంగాణ : వివేక్ వెంకటస్వామి

  • ఇప్పుడు ప్రకటించిన ఆరు గ్యారంటీలనూ అమలు చేస్తారు
  • కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి
  • కాంగ్రెస్​లో భారీగా చేరికలు

కోల్ బెల్ట్, వెలుగు : సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని.. ఇప్పుడు ప్రకటించిన 6 గ్యారంటీలను కూడా రాష్ట్రంలో అమలు చేస్తారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం చెన్నూరు మండలంలోని ఒడ్డెపల్లి, బుద్దారం, కన్నెపల్లి, లంబడిపల్లె తండా, ఏళ్లక్కపేట, సుద్దాల, కిష్టంపేట, చెన్నూరు లోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. మేరు సంఘం భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరినవారికి వివేక్ వెంకటస్వామి, కర్ణాటకలోని ధవనగిరి జిల్లా జగుళూర్ ఎమ్మెల్యే దేవేందరప్ప,  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కండువాలు కప్పి ఆహ్వానించారు.

లంబడిపల్లె తండాకు చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్​ఎస్​కు చెందిన బానాథ్ శారదా శుభకర్​, వార్డు మెంబర్ అరుణ, శ్రావణ్​రెడ్డి, రాజేశ్, శేఖర్, సేవ, లోకేశ్ తోపాటు పలువురు కాంగ్రెస్ లో చేరారు. చెన్నూరు పట్టణ మేరు సంఘానికి చెందిన 300 మంది సభ్యులు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ల చెందర్, రాపర్తి శ్యామ్ సుందర్, పెండ్యాల శ్రీనివాస్ నేతృత్వంలో చేరారు. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ లో చేరారు.

దళితుడిని సీఎం ఎందుకు చేయలే : ఓదెలు

గెలిపిస్తే తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు మాట నిలబెట్టుకోలేదని  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రశ్నించారు. కాంగ్రెస్​ కార్యకర్తలను బట్టలిప్పి కొడ్తానన్న బాల్క సుమన్​పై ఓదెలు ఫైర్​అయ్యారు. నియోజవర్గ ప్రజలు తలుచుకుంటే నిన్ను బట్టాలిప్పి పరిగెత్తిస్తారని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్, చెన్నూరులో బాల్క సుమన్ పీడపోవాలన్నారు. సుమన్​ను గెలిపిస్తే జనాల నెత్తిమీద ఎక్కి కూర్చుంటాడని.. మనసున్న వివేక్​ను గెలిపించుకుంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పారు.