భోపాల్: రెండు లక్షల మందికి పైగా బీజేపీలో చేరారంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నదంతా అబద్ధమని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జీతూ పట్వారీ అన్నారు. అంతమంది చేరి ఉంటే, వాళ్ల పేర్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం భోపాల్ లో మీడియాతో జీతూ పట్వారీ మాట్లాడారు. ‘‘పార్టీలో చేరిన ప్రముఖ నాయకుల లిస్టునే బీజేపీ విడుదల చేసింది. అందులో 336 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. నిజంగా ఆ పార్టీలో 2.58 లక్షల మందికి పైగా చేరి ఉంటే, వాళ్ల పేర్లను విడుదల చేయాలి” అని సవాల్ విసిరారు.
బీజేపీ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. ‘‘మైనింగ్, శాండ్, ట్రాన్స్ పోర్ట్, ఎడ్యుకేషన్ మాఫియా లీడర్లను బీజేపీ చేర్చుకున్నది. వివిధ పార్టీలు వెళ్లగొట్టిన లీడర్లను జాయిన్ చేసుకున్నది” అని విమర్శించారు. కాగా, గత 3 నెలల్లో బీజేపీలో 2.58 లక్షల మందికి పైగా చేరారని, వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులే ఉన్నారని మాజీ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
వాళ్లంతా మాఫియా లీడర్లా?: సలూజా
జీతూ పట్వారీ కామెంట్లపై బీజేపీ అధికార ప్రతినిధి సలూజా స్పందించారు. ‘‘ఇటీవల కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరి, చింద్వారా మేయర్ విక్రమ్ అహకే, ఎమ్మెల్యే కమ్లేశ్ షా, మాజీ మంత్రి దీపక్ సక్సేనా, జబల్ పూర్ మేయర్ జగత్ బహదూర్ సింగ్ తదితరులు ఉన్నారు. మరి వాళ్లంతా మాఫీయా లీడర్లేనా?” అని ప్రశ్నించారు.