ప్రియాంక స్త్రీశక్తి, రాహుల్ యువశక్తి..కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే ప్రశంస

ప్రియాంక స్త్రీశక్తి, రాహుల్ యువశక్తి..కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే ప్రశంస

బెళగావి: కాంగ్రెస్  ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా స్త్రీశక్తికి, రాహుల్  గాంధీ యువశక్తికి ప్రతిరూపాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్  ఖర్గే అన్నారు. బ్రిటిష్  పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన కిత్తూరు రాణి చెన్నమ్మ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి వీరమణులతో ప్రియాంకను ఖర్గే పోల్చారు. 1924లో కర్నాటకలోని బెళగావిలో కాంగ్రెస్  సమావేశాలకు గాంధీ బాధ్యతలు వహించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం బెళగావిలో కాంగ్రెస్  పార్టీ ఓ కార్యక్రమం  నిర్వహించింది. ఖర్గేతో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ ‘‘కిత్తూరు రాణి చెన్నమ్మ ఎవరంటే ప్రియాంక గాంధీయే. ఝాన్సీ రాణి కూడా ఆమెనే. ప్రియాంక చాలా శక్తివంతురాలు.

ఆమెలో మనం స్త్రీశక్తిని చూడవచ్చు. రాహుల్  గాంధీ కూడా యువశక్తికి ప్రతిరూపం” అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆయన విమర్శలు చేశారు. పార్లమెంటులో అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని ఆయన గుర్తుచేశారు. గాంధీ పట్ల మోదీ, షాకు గౌరవం ఉన్నా గాంధీని చంపిన గాడ్సేనే వారు ఆరాధిస్తారని ఆరోపించారు. హిందుత్వ సిద్ధాంతాన్ని పాటించిన వినాయక్  దామోదర్  సావర్కర్ కు గాడ్సే శిష్యుడని పేర్కొన్నారు. జవహర్ లాల్  నెహ్రు, సర్దార్  వల్లభాయ్  పటేల్, గాంధీ, అంబేద్కర్  మధ్య తేడాలు చూపుతూ మోదీ, షా డబుల్  గేమ్  ఆడుతున్నారని ఖర్గే విమర్శించారు.