- అదానీ, అంబానీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నరు
రాంచీ: ప్రతిపక్షాలను అణచివేసేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను మేకల్లా కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా.. అదానీ, అంబానీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేక తోలు కప్పుకున్న తోడేలులా వ్యవహరిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు.
సోమవారం ఆయన రాంచీలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులపై మోదీ, అమిత్‌షా ఈడీ, సీబీఐతో పాటు ఇతర కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారని.. కానీ, తాము భయపడమని ఖర్గే పేర్కొన్నారు. తాము స్వాతంత్ర్యం కోసం పోరాడామని ఆచప అన్నారు.
దేశాన్ని నలుగురు వ్యక్తులు (మోదీ, షా, అదానీ, అంబానీ) నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ, తాను.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ అబద్ధాలకోరు అని, తన వాగ్దానాలను ఎప్పుడూ నెరవేర్చని.. ఆయన పాలనలో గుజరాత్‌లో ఏదైనా స్వర్ణయుగం వచ్చిందా? అని ఖర్గే ప్రశ్నించారు. ‘‘25 ఏండ్లుగా మోదీని సీఎంగా, ప్రధానిగా సహిస్తున్నాం. కానీ, వెనుకబడిన ప్రజలను, మహిళలను దోపిడీ చేసే వారికి ఆయన మద్దతిస్తున్నారు. మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని మోదీ భయపడుతున్నారు. అక్కడికి వెళ్లేందుకు నేను ఆయనకు ధైర్యం ఇస్తున్నాను’’ అని కాంగ్రెస్ ఖర్గే పేర్కొన్నారు.