- ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తున్నరు
- బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్
నాగ్‌పూర్: దేశంలో కొంతమంది బీజేపీ నాయకులు సమాజాన్ని విభజించే నినాదాలు చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆదివారం మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఉమ్రేడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘బటేంగే టు కటేంగే (విభజిస్తే మనం పడిపోతాం) అని బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించకూడదన్నారు.
దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి ఎలాంటి సహకారం అందించలేదన్నారు. దొంగతనం, బెదిరింపులతో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఓడించాలన్నారు. దర్యాప్తు సంస్థలకు భయపడే మా పార్టీ నాయకులు కొంతమంది బీజేపీలో చేరారని చెప్పారు. ఒకే వ్యక్తి (మోదీని ఉద్దేశించి) 24 ఏండ్లు గుజరాత్‌కు పాలించినా.. అక్కడ ఇంకా పేదరికం ఎందుకు ఉందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలోనే మహారాష్ట్రలో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు.