- మీ సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నయ్
- మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్
- ప్రధాని చేసిన అభివృద్ధి చెప్పకుండా.. కాంగ్రెస్‌పై దుష్ర్పచారం చేస్తున్నడు
- ముస్లింలు, మటన్, మొఘల్, మంగళసూత్రం.. అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు
- తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ గుజరాత్ కు తరలించుకుపోయిండు
- అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కులగణన
- 2021లో చేయాల్సిన జనగణన ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్న
హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ప్రధాని మోదీ అబద్ధాలు, అసత్యాలు తప్ప.. అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ‘‘బీజేపీ వాళ్లు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదు. పదేండ్లలో చేసిందేందో చెప్తలేరు. కేవలం కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతున్నది. అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు” అని ఫైర్ అయ్యారు.
శుక్రవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నకిరేకల్ లో నిర్వహించిన జన జాతర సభలో ఖర్గే పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అదానీ, అంబానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని, వాళ్లకు టెంపోల్లో డబ్బులు వచ్చాయంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు ఈ సందర్భంగా ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ‘‘మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే.. మీరు కండ్లు మూసుకున్నారా? మీ సీబీఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నయ్?’’ అని ప్రశ్నించారు. మోదీ ఆరోపణలు నిజమైతే కేసులు పెట్టి ఇండ్లను జప్తు చేయాలని సవాల్ విసిరారు.
అంబానీ, అదానీకే మోదీ మేలు చేసిండు..
కాంగ్రెస్ పై మోదీ దుష్ర్పచారం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేసి ఆస్తులు లాక్కుంటుందని, చివరకు మహిళల మంగళసూత్రాలనూ తీసుకుంటుందని మోదీ ఆరోపణలు చేస్తున్నారు. మేం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కులగణన చేయాలని అనుకుంటున్నాం. అణగారిన వర్గాలకు న్యాయమైన వాటా కోసమే కులగణన. సివిల్ సర్వీస్ ఆఫీసర్లలో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా 27 శాతమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఆయా వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తున్నది. ముస్లింలు, మటన్, మొఘల్, మంగళసూత్రం.. వంటి చిన్న చిన్న అంశాలను మోదీ తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2021లో చేయాల్సిన జనగణన ఇంకా ఎందుకు చేయలేదో మోదీ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. తన దోస్తులైన అదానీ, అంబానీకే మోదీ మేలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ, మోదీ తన మిత్రులకు అప్పనంగా అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
త్వరలోనే పంట నష్ట పరిహారం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశామని ఖర్గే తెలిపారు. ‘‘ఎన్నికల కోడ్ వల్ల ఆరో గ్యారంటీ అయిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేయలేకపోయాం. ఎన్నికల కోడ్ ముగియగానే అది కూడా అమలు చేస్తాం. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశాం. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందిస్తాం. అమలు చేయగలిగే హామీలనే కాంగ్రెస్ ఇస్తుంది. ఇందుకు కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ప్రభుత్వాలే నిదర్శనం. బీజేపీ వాళ్లు నిరాశతో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం ఐదేండ్లు ఉంటుంది. ఈ ఐదేండ్లలో తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతుంది” అని చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
పువ్వు వాడిపోతది..
హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని ఆనాడు అంబేద్కర్ చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్ కు ఒక్క పెట్టుబడి కూడా రానియ్యకుండా, పరిశ్రమలన్నింటినీ మోదీ గుజరాత్ కు తరలించుకుపోయారని విమర్శించారు. దేశంలో హైదరాబాద్, బెంగళూరు ఏం పాపం చేశాయని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే భావన కాంగ్రెస్ కు లేదని.. విశాల భారత సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ఎజెండా అని చెప్పారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై కర్నాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటుంది. నా అల్లుడిపై వచ్చిన రూ. 500 కోట్ల ఆరోపణలపై విచారణ జరిపి, దోషిగా తేలితే శిక్ష వేయండి. శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఇక ఆయన వ్యాఖ్యలపై చర్చ అవసరం లేదు” అని పేర్కొన్నారు. ‘‘పువ్వులు పొద్దున పూస్తాయి.. సాయంత్రానికి వాడిపోతాయి. కానీ చెయ్యి ఎప్పుడు మీతోనే ఉంటుంది. దీన్ని మరిచిపోకండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ బీజేపీపై విమర్శలు చేశారు.
ఇక బీఆర్ఎస్ దుకాణం బంద్..
రాజ్యాంగాన్ని మారుస్తామని మోదీ అంటున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఖర్గే ప్రశ్నించారు. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పరోక్షంగా కలిసి పోటీ చేస్తున్నయ్. ఈసారి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్అయితది” అని అన్నారు. తెలంగాణ లో బీజేపీకి ఒక్క సీటు కూడా రావొద్దని, ఆ పార్టీ ఒక్క సీటు గెలిచినా రాజ్యాంగం ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చి దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. ‘‘పదేండ్లలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. ఐటీఐఆర్, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంత వరకు ఏర్పాటు చేయలేదు” అని మండిపడ్డారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి, మధుయాష్కీ, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.