మోదీ సర్కారు అవినీతికి అది నిదర్శనం: ఖర్గే

మోదీ సర్కారు అవినీతికి అది నిదర్శనం: ఖర్గే

న్యూఢిల్లీ: వర్షానికి ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు కూలిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఘటన గడిచిన పదేండ్లల్లో  మోదీ ప్రభుత్వ అవినీతికి, నిర్లక్ష్యానికి, నాసిరకం మౌలిక సదుపాయాలకు నిదర్శనమని పేర్కొంటూ ట్వీట్ చేశారు. " మోదీ పాలనలో ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు కూలిపోవడం, జబల్‌‌‌‌పూర్ ఎయిర్‌‌‌‌పోర్టు పైకప్పు కూలిపోవడం, అయోధ్యలో  కొత్తగా వేసిన రోడ్లు గుంతలు పడటం, రామమందిరం పైకప్పు లీకేజీ, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డుపై పగుళ్లు, 2023, 2024 మధ్యలో బీహార్‌‌‌‌లో 13 కొత్త వంతెనలు కూలిపోవడం, 

గుజరాత్‌‌‌‌లో ప్రగతి మైదాన్ టన్నెల్ మునిగిపోవడం, మోర్బీ వంతెన కూలిపోవడం వంటి అనేక ఘటనలు జరిగాయి. వీటన్నింటికి పదేండ్ల మోదీ ప్రభుత్వ పాలనే కారణం. మోదీ ప్రభుత్వ నాసిరకం మౌలిక సదుపాయాల కల్పనకు, వారి అవినీతికి, నేరపూరిత నిర్లక్ష్యానికి ఈ ఘటనలే నిదర్శనం. ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్ టెర్మినల్ 1ను ప్రారంభిస్తున్నప్పుడు ప్రధాని తనను తాను 

"దూస్రీ మిట్టీకా ఇన్సాన్" అని అభివర్ణించుకున్నారు. అది ఇప్పుడు కూలిపోయింది. మరి మోదీ ఇప్పుడు ప్రజలకు ఏం చెబుతారు. ఆయన తన వాక్చాతుర్యం అంతా ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్ వేడుకల్లో మాత్రమే ప్రదర్శిస్తారు" అని ఖర్గే మండిపడ్డారు. ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్ పైకప్పు కూలిన ఘటనలో మృతులకు ఖర్గే సంతాపం తేలియజేశారు. అవినీతి, స్వార్థపూరిత ప్రభుత్వం చేసిన తప్పుకు అమాయకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

దాన్ని మోదీ ప్రారంభించలేదు: రామ్మోహన్ నాయుడు

వర్షానికి ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్ పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రస్తుతం కూలిన టెర్మినల్ మోదీ ప్రారంభించినది కాదని తెలిపారు. దాన్ని 2009లో ఉన్న ప్రభుత్వమే నిర్మించిందని వెల్లడించారు. ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.