వన్ నేషన్.. వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తం: ఖర్గే

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తం: ఖర్గే

న్యూఢిల్లీ: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’​ ఆచరణలో సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. జమిలి ఎన్నికలను ప్రజలు అంగీకరించరని తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను కాంగ్రెస్​తో సహా 15 అపోజిషన్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును అడ్డుకుంటామని పలువురు నేతలు తేల్చి చెప్పారు. జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. బీజేపీ ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తాం. ఫెడరలిజానికి వ్యతిరేకం. దేశం దీన్ని అంగీకరించదు”అని అన్నారు. అలాగే, జమిలీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎంపీ మహువా మాజి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ వ్యతిరేకించారు. 

మణిపూర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవ్​భ్రతా సింగ్, శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి, ఎంపీ అర్వింద్ సావంత్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​తో పాటు పలు పార్టీల నేతలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకించారు. పార్లమెంట్​లో బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.

మోదీ, అమిత్​షాకే మేలు 

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం. వాటితో ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అమిత్​ షాకు తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదు. ఇది బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతం. ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. ఈ అంశంపై మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుంది. తరచుగా ఎన్నికలు ప్రజాస్వామ్య జవాబు దారీతనాన్ని మెరుగుపరుస్తాయి.
- అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎంపీ

పెద్ద కుట్ర దాగి ఉన్నది..

ఇండియా ఫెడరలిజం స్ట్రక్చర్​ను మరింత జఠిలం చేసేందుకు బీజేపీ చేస్తున్న ఓ కుట్రే జమిలీ ఎన్నికలు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్​కు మేము వ్యతిరేకం. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. రాష్ట్రాల సర్వాధికారాలు కేంద్రం చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. - పినరయి విజయన్, కేరళ సీఎం

బీజేపీది చీప్ పొలిటికల్ స్టంట్ 

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది బీజేపీ చీప్ పొలిటికల్ స్టంట్. ఏకకాలంలో ఎన్నికలు కోరుకుంటుంటే.. హర్యానా, జమ్మూ కాశ్మీర్​లతో పాటు మహారాష్ట్రకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. మూడు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సత్తాలేని కేంద్రానికి.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడే అర్హత లేదు. నిర్వహణ అంత ఈజీ కాదు. చాలా సార్లు రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అసెంబ్లీల నిబంధనల గురించి తెలుసుకోవాలి.
- డెరెక్ ఒబ్రెయిన్, టీఎంసీ నేత

ఇండియాలో సాధ్యం కాదు..

ప్రజాస్వామ్యయుత దేశమైన ఇండియాలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు.. టైమ్.. ఆదా చేద్దామని కేంద్రం అనుకుంటున్నప్పటికీ.. ఆచరణలో సాధ్యం కాదు. ‘ఆపరేషన్ లోటస్’ కుట్రలో ఇదొక భాగం. డీకే శివకుమార్, కర్నాటక డిప్యూటీ సీఎం

చరిత్రాత్మక నిర్ణయం 

మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంస్కరణల దిశగా నేడు చరిత్రాత్మక అడుగు పడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న  మోదీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం. అమిత్​షా