కాంగ్రెస్‌కు 295కుపైగా సీట్లు: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌కు 295కుపైగా సీట్లు: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తమ కూటమికి 295కుపైగా ఎంపీ సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఇండియా కూటమి నేతలతో ఖర్గే సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో మా కూటమే గెలుస్తుంది. ఫలితాలు మాకే అనుకూలంగా రానున్నాయి. మా కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లి నిర్వహించిన సర్వేలో ఇదే విషయం తేలింది. ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ రోజు మా కూటమి నేతలతో రెండు గంటల పాటు చర్చించాం. 

ముఖ్యంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని పార్టీలు తమ కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలని నిర్ణయించాం” అని ఖర్గే తెలిపారు. ఖర్గే నివాసంలో జరిగిన మీటింగ్ కు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఎస్పీ చీఫ్​అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఇతర నేతలు హాజరయ్యారు. వెస్ట్ బెంగాల్ లో ఆఖరి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఈ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. 

అయితే, కౌంటింగ్​రోజు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకే ఇండియా కూటమి సమావేశమైనట్టు ప్రచారం జరిగినా.. కూటమి నేతలందరినీ ఒకే తాటిపై ఉంచేందుకే వారు కలిసినట్టుగా చర్చ జరుగుతోంది. కాగా, శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్​చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మొదట నిరాకరించిన కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.