కాంగ్రెస్​ పార్టీకి పెద్ద పరీక్షే!

రాహుల్ వరస చూస్తుంటే  రాజీనామా ప్రకటన నుంచి  వెనక్కి తగ్గేలా లేరు. ఆయన నూటికి నూరు శాతం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తున్నారు. ఆయనను బుజ్జగించడానికి  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా వెళ్లినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. నెహ్రూ కుటుంబ సభ్యులకు మొత్తం పార్టీ అండగా ఉంది కాబట్టే  ఇన్నేళ్లుగా వారు కాంగ్రెస్ కు నాయకత్వం వహించారు. నెహ్రూ లెగసీ లేని వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పార్టీ నిలబడుతుందా? అయిష్టంగా రాహుల్​ కొనసాగితే పార్టీకి న్యాయం జరుగుతుందా?

పార్లమెంటరీ  ప్రజాస్వామ్యంలో ‘చెక్స్ అండ్ బ్యాలెన్స్’ వ్యవస్థ  చాలా అవసరం. అధికారపక్షానికి అవసరమైతే ముకుతాడు వేయగల స్థాయిలో ఓ బలమైన ప్రతిపక్షం ఉండాలి. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రస్తుతానికి ఎదురులేదు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  సొంతంగా 303  సీట్లు గెలుచుకుని  సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 55 సీట్లకే పరిమితమైంది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది అనేది ఇక్కడ లెక్క కాదు. నేషనల్ పాలిటిక్స్ లో ఇవాళ్టికి కూడా   బలమైన ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ప్రాంతీయ పార్టీల హవా కేవలం ఆయా  రాష్ట్రాలకే  పరిమితం. ఇక్కడ కాంగ్రెస్ ను ఒక రాజకీయ పార్టీ కంటే జాతీయ రాజకీయాల్లో అధికారపార్టీకి  పోటీగా నిలబడే ఒకే ఒక పార్టీ  అనే యాంగిల్ లో చూడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం అనేది లేకుండా పోతే అధికారపక్షం దూకుడును కట్టడి చేసే వ్యవస్థ అంటూ ఏమీ ఉండదు. పవర్ లో ఉన్న పార్టీ ఆడింది ఆటగా పాడింది పాటగా మారుతుంది. ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వం పాగా వేస్తుంది. లేటెస్ట్ ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా కాంగ్రెస్ కు 12 కోట్ల మంది ఓటు వేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవడం అవసరం.

కాంగ్రెస్​లో దుమారం

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఈ ఏడాది మే 25న ఏఐసీసీ చీఫ్ పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా దుమారం రేగింది. రాహుల్ గాంధీని బుజ్జగించడానికి సీనియర్ లీడర్లు రోజుల తరబడి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఇవాళ్టి వరకు రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్ చేసిన ప్రకటనను జాగ్రత్తగా గమనిస్తే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లే అనిపిస్తోంది.

నెహ్రూ  ట్యాగ్​లైన్​ లేకుండా కాంగ్రెస్ ఉంటుందా?

ఎవరెన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు  నెహ్రూ కుటుంబం చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రజల్లో నెహ్రూ  కుటుంబానికి ఉన్న ఆదరణే తమను అధికారానికి తీసుకువస్తుందని కాంగ్రెస్ లీడర్లు గట్టిగా నమ్ముతారు. అందుకే లెగసీ ని కాపాడుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తుంటారు. నెహ్రూ కుటుంబానికి  ఐదో తరం ప్రతినిధిగా ఉన్న రాహుల్ ఇప్పటివరకు కాంగ్రెస్ కు నాయకత్వం వహించారు. ఇప్పుడు సడెన్ గా నాయకత్వం నుంచి రాహుల్ వైదొలగితే ఏం చేయాలన్న ప్రశ్న కాంగ్రెస్ లీడర్లను తొలచివేస్తోంది. ఎవరి ఫొటో పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలో  తెలియని పరిస్థితి వారిది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజీనామా ప్రకటన చేయడం కంటే రాహుల్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. కాంగ్రెస్ బలం పెంచే చర్యలు తీసుకుంటే బావుండేది.‘ సెలెక్టెడ్ లీడర్లను ’ పక్కన పెట్టి  ‘ ఎలెక్టెడ్ లీడర్లకు ’ పెద్ద  పదవులు అప్పగించాల్సింది. ప్రజల్లో గుడ్ విల్ ఉన్న నాయకులను  కీలకమైన పోస్టుల్లో పెడితే బావుండేది. కానీ రాహుల్ ఇవేమీ చేయలేదు.

రాహుల్ ఉద్దేశం ఏంటి ?

నెహ్రూ ట్యాగ్ లైన్ లేని వాళ్లే కాంగ్రెస్ పార్టీని ఒడ్డుకు చేర్చగలరన్నది రాహుల్ ఉద్దేశం అయి ఉండొచ్చు. పార్టీని డెమోక్రటిక్ గా నడపనంతకాలం ఫెయిల్యూర్స్  ఎదురవుతూనే ఉంటాయని ఆయన భావించి ఉండొచ్చు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా  కొన్ని రాష్ట్రాల్లో  సీనియర్ లీడర్లు పార్టీ ప్రయోజనాల కంటే కొడుకుల కోసం ఎక్కువ కష్టపడ్డారని రాహుల్ ఫీలయ్యారు. ఈ కారణంతోనే సామాన్య ప్రజలకు పార్టీ దూరమైందని రాహుల్ ఫిక్స్ అయ్యారన్నది  రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకే పార్టీ పగ్గాలు నాన్ నెహ్రూ  ఫ్యామిలీ లీడర్ కు అప్పగించాలన్నది రాహుల్ ప్లాన్ అయి ఉండొచ్చు. రాహుల్ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ, నెహ్రూ  కుటుంబ ట్యాగ్ లైన్ లేకుండా రాజకీయంగా మనుగడ సాగించడం కష్టమన్న సంగతి పార్టీ సీనియర్ లీడర్లకు తెలియనిది కాదు. అందుకే రాహుల్ కు సర్ది చెప్పడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు  రాహుల్ గాంధీ ప్రకటన అయితే చేశారు కానీ పార్టీ వ్యవహారాలకు దూరం కాలేదు. తాజాగా చత్తీస్ గఢ్ పీసీసీ కి కొత్త ప్రెసిడెంట్ ను నియమించారు. మిగతా రాష్ట్రాల వ్యవహారాలను ఇంట్లోనే కూర్చుని  సూపర్ వైజ్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో  రాజీనామా పై రాహుల్ బెట్టు చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఏదో ఒక రోజు కార్యకర్తల అభిప్రాయాన్ని  గౌరవిస్తూ రాజీనామా నిర్ణయాన్ని  వాపసు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పే అవకాశాలున్నాయని సీనియర్ లీడర్లు భావిస్తున్నారు. ఏమైనా లోక్​  సభ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ కాంగ్రెస్, రాహుల్ గాంధీ రాజీనామా ప్రకటనతో మరింత చిక్కుల్లో పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

నెహ్రూ వారసులే నడిపించారు

జవహర్ లాల్ నెహ్రూ చనిపోయేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలోనే  ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ ఎప్పుడూ ఆయన సొంత సంస్థగా మారలేదు. పార్టీ కంటూ ఒక ఐడెంటిటీ ఉండేది. ఒక బలమైన రాజకీయ శక్తిగా కొనసాగింది. నెహ్రూ చనిపోయిన తర్వాత కామరాజ్ నాడార్ నాయకత్వంలోని కాంగ్రెస్, లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిని చేసింది. రష్యా టూర్ లో ఉండగా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. ఆ తర్వాత ప్రధాని పదవి కోసం మొరార్జీ దేశాయ్, ఇందిర మధ్య పోటీ నడిచింది. ఈ పోటీలో గెలిచి ఇందిర ప్రధాని అయ్యారు. 1969 లో పార్టీ చీలిక తర్వాత కాంగ్రెస్ లో ఇందిర బలపడ్డారు. పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ లో నెహ్రూ కుటుంబ హవా మొదలైంది. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ వీళ్లే పార్టీకి దిక్కయ్యారు. కాంగ్రెస్ అంటేనే నెహ్రూ కుటుంబ పార్టీ అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది.

1969లో కాంగ్రెస్లో చీలిక

1969లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. ఇందులో ఒక కాంగ్రెస్ అప్పటి ప్రధాని ఇందిర నాయకత్వం లోకి వెళ్లింది. కొత్త కాంగ్రెస్ గా ప్రజల్లో ఇది పాపులర్ అయింది.  రెండో కాంగ్రెస్  నిజలింగప్ప, ఎస్ కే పాటిల్, మొరార్జీ దేశాయ్, కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి  వంటి ప్రముఖుల నాయకత్వంలో  ఉండేది. దీనినే  సిండికేట్ అని కూడా అనేవారు. కాంగ్రెస్ (ఓ) గా కూడా పాపులర్ అయింది. పార్టీ చీలిక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే…1969 నాటికి  ప్రధానిగా ఉన్న ఇందిరకు సిండికేట్ నాయకులకు మధ్య గొడవలు  మొదలయ్యాయి. బెంగళూరులో జరిగిన పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డిని  రాష్ట్రపతి కేండిడేట్ గా సిండికేట్ కాంగ్రెస్ ప్రకటించింది. దీనిని ఇందిర వ్యతిరేకించారు. వీవీ గిరి ఇండిపెండెంట్ గా రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడ్డారు. కాంగ్రెస్ లో  తన మాట నెగ్గించుకోలేకపోయిన ఇందిర, పార్టీ సభ్యులకు విప్ జారీ చేయలేదు. అంతరాత్మ  చెప్పినట్లు  ఓటు వేయమని కాంగ్రెస్ లీడర్లను కోరారు. దీంతో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు. ఇందిర  ప్రోత్సాహంతో పోటీ చేసిన వీవీ గిరి గెలిచి రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. పార్టీ క్రమశిక్షణ లైన్ దాటారని ఆరోపిస్తూ 1969 నవంబరు 12న  ఇందిరను  కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ చీలిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇందిర హయాం మొదలైందని చెప్పవచ్చు.

సోనియా హయాంలో తగ్గిన సీడబ్ల్యూసీ హవా

కాంగ్రెస్ లో 1999 నుంచి సోనియా గాంధీ హయాం మొదలైంది. పార్టీని పూర్తిగా నెహ్రూ కుటుంబ అఫైర్ గా మార్చేశారన్న విమర్శలు ఆమె పై ఉన్నాయి. ఈ 20 ఏళ్లలో  ప్లీనరీ సమావేశాలు జరిగింది  చాలా తక్కువ సార్లు.  కీలకమైన ప్లీనరీ సమావేశాలను పక్కన పెట్టి స్పెషల్ సెషన్స్ తో  ఆమె పార్టీని నడిపారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎక్కువకాలం చైర్ పర్సన్ గా పనిచేసిన రికార్డును సోనియా సొంతం చేసుకున్నారు. సోనియా కు ముందు ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎవరున్నప్పటికీ  కీలక నిర్ణయాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పాత్ర ఎక్కువగా ఉండేది. సీడబ్ల్యుసీ ని కాదని ఎలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదు. కాంగ్రెస్ లో సోనియా  హయాం మొదలయ్యాక సీడబ్ల్యూసీ  అలంకార ప్రాయంగా మారిందన్న విమర్శలు వచ్చాయి.

ఇందిరదే కాంగ్రెస్

కాంగ్రెస్ రాజకీయాల్లో  ఇందిరా గాంధీ హయాంను ఓ శకంగా చెప్పుకోవచ్చు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని లీడర్లు రాజకీయంగా ఎదిగేవారు. ఇందిర దీనికి బ్రేక్ వేశారు. పార్టీని మించి ఆమె ఎదిగారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇందిరను బహిష్కరించారు. అధికారిక కాంగ్రెస్ అప్పటికి కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో ఉండేది. దీంతో  బహిష్కరణకు గురైన ఇందిర ఆ తర్వాత తన పేరుతోనే మరో కాంగ్రెస్ ను ఏర్పాటు చేశారు. అదే ఇందిరా కాంగ్రెస్. 1978 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇందిరా కాంగ్రెస్ పోటీ చేసి విజయాన్ని సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కర్ణాటకలో  దేవ్ రాజ్ అర్స్ ముఖ్యమంత్రులయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొంతకాలానికే రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖులు అంతా కాంగ్రెస్ (ఐ) లో చేరారు. ఆ తర్వాత  ఇందిర కాంగ్రెస్ లో రెడ్డి  కాంగ్రెస్ విలీనమైంది.

పవర్ ఫుల్ పీఎం

దాదాపు 16 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా ఇందిర పనిచేశారు. ఆత్మ స్థైర్యం, ఎక్కడా రాజీపడని మనస్తత్వం ఆమె సొంతం.  అన్ని విధాలుగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆమె దేశానికి నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇందిరది కీలక పాత్ర. ప్రధానిగా ఆమె ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. ట్వంటీ పాయింట్ ఫార్ములా, గరీబీ హటావో పథకం, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలను ఆమె ధైర్యంగా తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో  ప్రజలకు ఆమె బాగా దగ్గరయ్యారు. ఇవాళ్టికి కూడా అట్టడుగు వర్గాల్లో కాంగ్రెస్ కంటూ ఒక ఫిక్స్ డ్ ఓటు బ్యాంకు ఉందంటే అది ఇందిర పుణ్యమేనని చెప్పాలి.

అంతర్జాతీయంగా ఇండియాకు గుర్తింపు

ప్రపంచంలోనే ఇండియాను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఇందిరదే. అంతర్జాతీయ సంబంధాలలో కూడా ఆమె నేర్పుగా వ్యవహరించారు. అప్పటి సోవియట్ యూనియన్ తో  దోస్తానా చేసినప్పటికీ ఎక్కడా అమెరికా వ్యతిరేకి గా ముద్ర పడకుండా జాగ్రత్తపడ్డారు.