గంగాధర, వెలుగు: గంగాధర మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లి, గంగాధర, ఇస్తారుపల్లి, వెంకంపల్లిలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రవిశంకర్ తాను పుట్టిన ఊరు నారాయణపూర్, పెరిగిన ఊరు గంగాధర, ఉంటున్న ఊరు బూరుగుపల్లికి చేసిందేమీ లేదని విమర్శించారు.
రెండేళ్ల కింద కురిసిన భారీ వర్షాలకు గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట తెగి గంగాధర, నారాయణపూర్ గ్రామస్తులు ఇబ్బంది పడ్డారని, కట్టకు ఇప్పటిదాకా రిపేర్చేయకపోవడంతో రైతులు నాలుగు పంటలు నష్టపోయారన్నారు. తాను గెలిచాక గంగాధర ఎల్లమ్మ చెరువు కట్టకు రిపేర్లు చేయించి ఆయకట్టు పంటలకు సాగునీరందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురుమళ్ల మనోహర్, లీడర్లు పుల్కం నర్సయ్య, గంగన్న, దుబ్బాసి బుచ్చన్న, రాజిరెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.