
న్యూఢిల్లీ: పహల్గాంలో కేంద్ర హోం శాఖ భద్రతా వైఫల్యం, నిఘా లోపంతోనే ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆరోపించింది. ఎల్లప్పుడూ మూడంచెల భద్రత ఉండే ప్రదేశంలో పర్యాటకులపై దాడి జరగడం దారుణమని పేర్కొంది. ఈ దాడి ముమ్మాటికీ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల పనేనని వెల్లడించింది. టెర్రరిస్టులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
గురువారం ఈ మేరకు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు హాజరయ్యారు.