
- ఓసీలకు టికెట్ ఖరారు చేసిన బీఆర్‌ఎస్, బీజేపీ
- బీసీ క్యాండిడేట్‌ను బరిలో దింపిన కాంగ్రెస్
- 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓట్లే టార్గెట్
- పటాన్‌చెరులో కాటా సహకారంపై అనుమానాలు
మెదక్/సంగారెడ్డి, వెలుగు : బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారిన మెదక్ పార్లమెంట్ స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఓసీ క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వగా కాంగ్రెస్ బీసీ అస్త్రాన్ని ప్రయోగించి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఖరారు చేసింది. మెదక్ టికెట్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓసీ లీడర్లు చాలా మందే పోటీ పడినప్పటికీ ఇటీవలే బీఎస్పీ నుంచి చేరిన మధుకు హైకమాండ్ఛాన్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
50 శాతానికి పైగా బీసీ ఓటర్లే...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 18 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 శాతానికి పైగా బీసీలే ఉన్నారు. అంతేకాకుండా ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ముదిరాజ్‌ల జనాభా ఎక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇక్కడ బీసీ క్యాండిడేట్, అందులోనూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపితే గెలుపు ఈజీ అవుతుందని హైకమాండ్ అంచనా వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లాస్ట్ మినిట్‌లో ఎమ్మెల్యే టికెట్ మిస్
పటాన్‌చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ సర్పంచ్‌గా పనిచేసిన నీలం మధు గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు మొదట టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఎస్పీలో చేరారు. ఆ పార్టీ టికెట్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 46,192 ఓట్లు సాధించారు. ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన మధు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి బీసీ కోటాలో మెదక్ లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఈ నియోజకవర్గ టికెట్ కోసం 11 మంది దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మరికొందరు నాయకులు సైతం టికెట్ఆశించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నీలం మధు వైపు మొగ్గు చూపి టికెట్ ఖరారు చేసింది.
కాటా సహకరించేనా ?
పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం నీలం మధుకు సహకరిస్తారా ? లేదా ? అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు మొదట టికెట్ ఖరారు అయినప్పటికీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బీ ఫాం కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కింది. దీంతో నీలం మధు బీఎస్పీలో చేరి పోటీ చేసి 46 వేలకు పైగా ఓట్లు సాధించాడు. దీంతో కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీనివాస్‌గౌడ్ ఓడిపోయారు. ఇప్పుడు మెదక్ ఎంపీ టికెట్ దక్కించుకున్న మధుకు కాటా శ్రీనివాస్‌గౌడ్, ఆయన అనుచరులు మద్దతు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో కాటా సహకరిస్తే నీలం మధుకు గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.