బీఆర్ఎస్ ​స్కీములనే కాంగ్రెస్ కాపీ కొట్టింది: నామా నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్​ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములనే కాంగ్రెస్​పార్టీ కాపీ కొట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఖమ్మంలోని పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, క్యాండేట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షత వహించగా, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, జడ్పీ చైర్మన్, మధిర అభ్యర్థి లింగాల కమల్​రాజు, వైరా అభ్యర్థి మదన్ లాల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం ఎంపీ నామా, మంత్రి అజయ్ మీడియాతో మాట్లాడారు.

 కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ బీఆర్ఎస్ పథకాలేనన్నారు. ఆరు గ్యారెంటీల్లో రైతుబంధు మాదిరిగా ఓ పథకం పెడతామనడం కాపీ కొట్టడం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలోని స్కీములను కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొడుతోందన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడైనా బీమా స్కిములు పెట్టిందా అని నిలదీశారు. రైతులు, స్టూడెంట్లు, నిరుద్యోగులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంది కాంగ్రెస్ పాలనలోనేనని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్​లీడర్లు ఏదైనా చేస్తామంటున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తీర్పు ఈసారి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ కి పోటీ ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ, నేటికీ అభ్యర్థులను తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సిటీ మేయర్ నీరజ, సిటీ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్​ ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధును టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లపై స్పందించేందుకు బీఆర్ఎస్​ లీడర్లు ముందుకురాలేదు. సమన్వయ సమావేశంలో దీనిపై చర్చించలేదని తెలిసింది.