
మాజీ సీఎం కేసీఆర్ కు జీతం నిలిపివేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాశారు కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్. మంగళవారం ( మార్చి 11 ) స్పీకర్ ను కలిసిన రాజశేఖర్ లేఖను సమర్పించారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం లేదని.. ఆయనకు జీతభత్యాలు నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు రాజశేఖర్. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. కేసీఆర్ బడ్జెట్ సెషన్స్ కి హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు హాజరై వెళ్లిపోయిన కేసీఆర్.. ఈ ఏడాది కూడా ఒక్కరోజే బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇటీవలే పాస్ పోర్టును మార్చుకున్న కేసీఆర్ దంపతులు త్వరలోనే విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ చాలా రోజులుగా తప్పు పడుతూ వస్తోంది. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ అపారమైన అనుభవంతో తమకు మార్గనిర్దేశనం చేయాలంటూ సీఎం రేవంత్ పలుమార్లు అసెంబ్లీ వేదికగానే పేర్కొన్నారు. అయినా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.